25 శాతం మంది ప్రజల పేదరికం తగ్గించగలిగాం

25 శాతం మంది ప్రజల పేదరికం తగ్గించగలిగాం

తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక వ్యవస్థ, నిజాయతీతో సాగిస్తున్న కృషి, ప్రజల భాగస్వామ్యానికి ఇస్తున్న ఇతోధిక ప్రాధాన్యం వల్ల గడచిన తొమ్మిది సంవత్సరాలలో రమారమి 25 శాతం మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 

భారత్‌లో పేదరికం తగ్గుముఖం పట్టగలదని ఎవ్వరూ భావించి ఉండరని, కానీ తమకు వసరులు సమకూర్చినట్లయితే పేదరికం నుంచి బయటకు రాగలమని ప్రజలు నిరూపించారని ప్రధాని కొనియాడారు.  ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులతో వర్చువల్ సంప్రదింపుల సమయంలో ప్రధాని ఈ మాటలు చెప్పారు.

 పేదరికం గణాంకాల తగ్గుదలను సూచిస్తున్న నీతి ఆయోగ్ నివేదికను మోదీ ఉటంకిస్తూ, నిరుపేదలకు చేయూత ఇవ్వడంలో ఇతర దేశాలకు భారత్ ఒక నమూనా ఇచ్చిందని, అది ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలియజేశారు. ఆ నివేదిక ఎంతో ప్రోత్సాహకరమైందని ఆయన పేర్కొన్నారు. 

తన ఊహకు మించి యాత్ర జయప్రదం అయిందని, జన బాహుళ్యం నుంచి పెరుగుతున్న డిమాండ్ వల్ల యాత్ర గడువును ఈ నెల 26 నుంచి తన ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉందని ప్రధాని తెలిపారు.  యాత్ర రెండు నెలల్లో ప్రజా ఉద్యమంగా మారిందని, అంతిమ ప్రయోజనాల కల్పనకు ఒక చక్కటి ఉదాహరణగా అధ్యయనంలో తేలగలదని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 

అది ఇప్పటికే 70, 80 పంచాయతీలను చేరిందని ప్రధాని తెలియజేశారు. కాగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం ఇవ్వడం, రైతులను సాధికారులను చేయడం తన ప్రభుత్వ ప్రాథమ్యం అని ప్రధాని చెప్పారు. ‘భారత్ శీఘ్రంగా మారిపోతున్నది. ప్రజల ఆత్మవిశ్వాసం, ప్రభుత్వంలో నమ్కకం, నవ భారత నిర్మాణానికి సంకల్పం అన్ని దిశలా దృగ్గోచరం అవుతోంది’ అని మోదీ వివరించారు.