
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం బుధవారం అర్థరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు.
విగ్రహం వెళుతున్న ట్రక్‌ను కొంతసేపు అయోధ్యలోని హనుమాన్‌గఢి ఆలయం వద్ద ఆపారు. అనంతరం రామ మందిరానికి తీసుకొచ్చారు. కొంతసేపటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు.
కాగా, వెండితో చేసిన ఒక రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఊరేగించారు. పూజారి నెత్తిపై కలశాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు. అంతకుముందు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా అయోధ్యలో కలశ పూజ ఘనంగా నిర్వహించారు.
శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్‌మిశ్రా దంపతులు సరయు నది ఒడ్డున దీనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామమందిరానికి తీసుకుని వెళ్లారు. కాగా, గురువారం అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి బాల రాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. దీంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.
ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం అయోధ్య రామునికి సంప్రదాయ ఆచార విల్లు ‘ఓనవిల్లు’ను బహూకరించనుంది. ఈ నెల 18న అయోధ్యలో దీనిని ఆలయ నిర్వాహకులు అయోధ్య ట్రస్ట్‌కు అందజేస్తారు. కాగా, రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలు జనవరి 22న పాఠశాలలకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్