విదేశీ విద్యార్థుల రాకపై కెనడా పరిమితులు!

విదేశీ విద్యార్థుల రాకపై కెనడా పరిమితులు!
విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ కెనడా వలసల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగిత, ఇళ్ల కొరత నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. కెనడా నిర్ణయాలు భారతీయులపైనా ప్రభావం చూపిస్తాయన్న భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 
 
అమెరికా యూనివర్శిటీల్లో సీటు దొరక్కపోతే కెనడాకు వెళ్లి చదువుకుని, అక్కడే స్థిరపడాలని భావించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇటీవల సంవత్సరాలలో గణనీయంగా పెరుగుతున్నది. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రిమిల్లర్ కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పిందని వ్యాఖ్యానించారు. 
 
‘‘ఆంక్షల అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉంది. ప్రావిన్స్ ప్రభుత్వాలు తమ బాధ్యతను నిర్వర్తించే చూడాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన తెలిపారు.  ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ఇళ్లకు డిమాండ్ తగ్గించేందుకు వీలుగా అంతర్జాతీయ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
 
మరికొన్ని నెలల్లో ఈ ఆంక్షలు అమల్లోకి రావచ్చని పేర్కొన్నారు. అయితే, ఆంక్షలు ఏ స్థాయిలో ఉంటాయనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఆంక్షల అంశం కొంత కాలం క్రితమే తెరపైకి వచ్చినా ఇప్పుడు అమలుపై దృష్టి పెట్టడానికి గల కారణాలనూ ఆయన వెల్లడించారు. ప్రావిన్సుల్లోని విద్యాసంస్థలు ఏం చేస్తున్నాయనే విషయాన్ని జాతీయ ధృక్కోణంలో పరిశీలించాలని మంత్రి చెప్పారు. 
 
అయితే, అన్ని సమస్యలకూ ఒకే పరిష్కారం తరహాలో ఈ ఆంక్షలు ఉండవని ఆయన చెప్పారు. కెనడా ప్రభుత్వ సాయంతో నిర్మించ తలపెట్టిన ఇళ్ల కంటే ప్రస్తుతం విదేశీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న అంశంపై కూడా మంత్రి స్పందించారు. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలకు సంబంధించి ఇళ్ల కొరత అంశం కేవలం ఓ భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. 
 
దేశంలో పనిచేస్తున్న విదేశీయుల సగటు వయసు తగ్గింపును కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు కెనడాకు ఓ ముఖ్య ఆదాయ వనరుగా మారారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తోందంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.  అయితే, ఈ ఏడాది 4,85,000 మంది విదేశీయులను దేశంలోకి అనుమతించేందుకు కెనడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే రెండేళ్లల్లో ఏటా 5 లక్షల మంది చొప్పున విదేశీయులను అనుమతించాలని లక్ష్యం పెట్టుకుంది.