రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని 11 రోజుల క్రతువు

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని పలు ఆచారాలాను, నియమాలను పాటించనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నుంచి 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో సందేశంను పోస్ట్ చేశారు. తన జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని ప్రధాని చెప్పారు. తొలిసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని తెలిపారు. శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్టను వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

రామమందిర ప్రారంభోత్సవానికి ముందు పాటించాల్సిన ఆచారాల గురించి ప్రధాని ఇప్పుటికే తెలుసుకున్నారని సమాచారం. ఈ మేరకు 11 రోజుల పాటు ఉపవాసంలో ఉంటారని తెలుస్తోంది. గ్రంథాల్లో చెప్పిన అన్ని నియమాలను పాటించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. బ్రహ్మముహూర్తంలో జాగారం చేస్తారని సమాచారం. 

అంతేకాకుండా ఎంత బిజీ షెడ్యూల్​ ఉన్నా మహారాష్ట్ర నాసిక్​లోని పంచవటిని సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారట. 14ఏళ్ల వనవాసంలో చాలా సమయం శ్రీరాముడు అక్కడే గడిపాడు. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందుకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ప్రధాని మోదీ.

“ఇలాంటి భావాలను నేను ఎప్పుడు అనుభూతి చెందలేదు. ఇలాంటి పవిత్రమైన రోజును చూడటం నా అదృష్టం. ప్రాణప్రతిష్ఠ సమయంలో భారత ప్రజలకు ప్రాథినిథ్యం వహించేందుకు, భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు. ఈ ఘట్టం కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.

“ఆలయంలో దేవుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ముడుపు కట్టడంతో పాటు ఆ రోజుకు కొన్ని రోజుల ముందు నుంచే కొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. మోదీ.. రామ భక్తుడు. ఆధ్యాత్మిక మార్గంలో ఆలయాన్ని నిర్మించి, ప్రారంభించేందుకు ప్రధాని కట్టుబడి ఉన్నారు,” అని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.

“ప్రాణప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు చేయాల్సిన నీయమ ఆచారాన్ని ప్రధాని మొదలుపెట్టారు. బ్రహ్మముహూర్త జాగారం, సాధన, సాత్విక వంటలు తినండం వంటి ఆచారాలను మోదీ చేస్తున్నారు. 11 రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటున్నారు,” అని మరో అధికారి వివరించారు.