
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం వచ్చే బడ్జెట్ లో నిధుల సమీకరణ గురించి కలత చెందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కీలక ప్రోజెక్టుల విషయంలో అనాసక్తిగా వ్యవహరిస్తున్నారా? ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు, ఫార్మా సిటీ వంటి వాటిపై ఆయన రోజుకొక మాట చెబుతూ ఉండటం ఇటువంటి అనుమానాలకు దారితీస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ కు ప్రతిష్టాకరమైన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండింటికి ఆటకెక్కిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఆ తర్వాత మాటమార్చి వాటిని అవసరమైన మార్పులతో అమలు పరుస్తామని ప్రకటించారు. తాజాగా, రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి, శంకుస్థాపన చేసిన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో టు ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు (కెప్ట్ ఆన్ హోల్డ్) రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగురోడ్డు అందుబాటులో ఉన్నదని తెలిపారు.
దానికి బదులుగా ఎయిర్‌పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్‌ను కూడా అక్కడే పూర్తిచేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడిది గందరగోళంలో పడింది.
పలు విస్తరణ ప్రాజెక్టులతోపాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ఐదు మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి