చలిగాలులతో యుపి పాఠశాలలకు సెలవులు

చలిగాలులతో యుపి పాఠశాలలకు సెలవులు
ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో చలి చంపేస్తున్నది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచి కాలు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, లక్నో జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది.
 
తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు. ఒకటి నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు ఈ నెల 6 వరకు సెలవులు ప్రకటించారు.   విపరీతమైన చలికి చిన్నారులు తట్టుకోలేని కారణంగా ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను ఈ నెల 14 వరకు మూసివేయాలని విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 
అలాగే ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోనూ ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అయితే 9 నుంచి 12 వరకు చదువుతున్న పిల్లలకు సెలవులు ఇవ్వకపోయినా టైమింగ్స్‌లో మార్పులు చేశారు. వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు బోధించనున్నారు. 
 
ఇక వేసవికాలంలో మాదిరిగా.. ఈ కాలంలో పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ పాఠశాల సమయాలను మార్చారు. జనవరి 2 (మంగళవారం) నుంచి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు మాత్రమే నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగాపడిపోతున్నాయి. వాయువ్య దిశ నుంచి నగరం వైపు చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజైన సోమవారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదైంది.  గత నాలుగేళ్లలో ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2020లో జనవరి 1న అత్యల్పంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 14.7 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.1 డిగ్రీలు కాగా.. సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువ.