2024 లోక్ సభ ఎన్నికల్లో మూడో సారి మోదీ ప్రభంజనం

2024 లోక్ సభ ఎన్నికల్లో మూడో సారి మోదీ ప్రభంజనం

దేశంలో ‘మోదీ’ మేనియా తగ్గలేదని, 2024 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 295 నుంచి 335 సీట్లు వస్తాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అది 353గా ఉంది. ఇందులో ఒక్క బీజేపీకే 303 సీట్లు వచ్చాయి.

ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి 165- 205 సీట్లు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే విపక్షాలు ఈసారి మెరుగైన ప్రదర్శనే చేస్తాయని, కానీ బిజెపిని కట్టడి చేయలేవని స్పష్టం చేసింది.

 “2024 లోక్ సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన తొలి ఒపీనియన్ పోల్ ఇది. ఏబీపీ న్యూస్- సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుంది. విపక్షాల సీట్లు పెరుగుతాయి. బిహార్, పంజాబ్, మహారాష్ట్రతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీకి కాన్ని విపక్షా కూటమి కాస్త మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది,” అని సర్వే పేర్కొంది. 

ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతంలోనే అతిపెద్ద సవాలు ఎదురవుతుందని తాజా ఒపీనియన్ పోల్ పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఓ కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేపట్టింది సీ- ఓటర్. రాష్ట్రాల వారీగా 18ఏళ్లు పైబడిన వారిని లోక్సభ ఎన్నికల విషయాలను ప్రశ్నించింది. 543 లోక్సభ సీట్లల్లో 13,115 మంది ఫీడ్బ్యాక్ తీసుకుని నివేదికను రూపొందించింది.

ఇక జోన్ల వారీగా చూసుకుంటే నార్త్ జోన్ బీజేపీకి పటిష్ఠంగా ఉంది. అక్కడ 150 నంచి 160 (మొత్తం 180) గెలవొచ్చు. ఈష్ట్ జోన్లో (మొత్తం 153)లో 80 నుంచి 90 సీట్లు వస్తాయి. వెస్ట్ జోన్లో 78 సీట్లుండగా ఎన్డీఏ కూటమికి 45-55 సీట్లు వరిస్తాయి. సౌత్ జోన్లోని 132 సీట్లల్లో ఎన్డీఏ కేవలం 20-30 సీట్లల్లో సరిపెట్టుకుంటుంది.

కాంగ్రెస్- విపక్ష కూటమికి సౌత్ జోన్లో మంచి పట్టుకనిపిస్తుంది. ఇక్కడ 70-80 సీట్లు వెనకేసుకునే అవకాశం ఉంది. ఈష్ట్లో 50-60, నార్త్లో 20-30, వెస్ట్లో 25-35 సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సర్వే ద్వారా తేలింది.  రాష్ట్రాల వారీగా చూసుకుంటే  అత్యంత కీలకంగా ఉండే ఉత్తర్ ప్రదేశ్ (80 సీట్లు)లో ఎన్డీఏ కూటమికి 73-75 స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది! మధ్యప్రదేశ్లో 27-29, ఛత్తీస్గఢ్లో 9-11, రాజస్థాన్లో 23-25 సీట్లు రావొచ్చు. 

కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనూ  52శాతం ఓటు షేరుతో బీజేపీ 22 నుంచి 24 స్థానాలు దక్కించుకోవచ్చని సర్వేలో బయటపడటం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్కు 4-6 సీట్లే వస్తాయని, ఓటు షేరు 43గా ఉంటుందని సర్వే పేర్కొంది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇండియా కూటమికి 9-11 సీట్లు (మొత్తం 17) రావొచ్చు. బెంగాల్లో అది 23-25గా, పంజబ్లో 4-6గా ఉండొచ్చని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ సర్వే వెల్లడించింది.

సర్వే ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ మోదీ పనితీరుపై ఎంత మేర సంతృప్తికరంగా ఉన్నారు? అన్న ప్రశ్నకు 47.2శాతం మంది సానుకూలంగా స్పందించారు. 30.2శాతం మంది కూడా సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, ఇంకా మెరుగైన పనితీరు కనబరచవచ్చని అభిప్రాయపడ్డారు. 21.3శాతం అసలు సంతృప్తిగానే లేనట్టు తేల్చిచెప్పారు.

ఇక 2024 లోక్ సభ ఎన్నికల సమయం నాటికి విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ఐకమత్యంతో ఉంటాయా? అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ‘లేదు, కష్టమే’ అని జవాబిచ్చారు

.