బందీల కుటుంబాల నుంచి ఇజ్రాయిల్ ప్రధానికి తీవ్ర వ్యతిరేకత

బందీల కుటుంబాల నుంచి ఇజ్రాయిల్ ప్రధానికి తీవ్ర వ్యతిరేకత
ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం ప్రారంభమై 80 రోజులు దాటినా ఇంకా హమాస్ తీవ్రవాదుల చెరలో చాలామంది ఇజ్రాయిల్ పౌరులు బందీలుగా ఉంటుండడంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు వారి కుటుంభం సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి స్థాపనకు సహకరించాలంటూ ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.
 
మంగళవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా పార్లమెంట్‌ గ్యాలరీలో ఉన్న బందీల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. బందీల ఫొటోలు, పేర్లు ఉన్న పోస్టర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బందీలను విడిపించేందుకు మరికొంత సమయం పడుతుందని నెతన్యాహు చెప్పగా సమయం లేదంటూ ఆందోళనకారులు కేకలు వేశారు.
 
`ఇప్పుడే..! ఇప్పుడే..!’ అంటూ నినాదాలు చేశారు. ‘మీరు మా వాళ్లను తిరిగి తీసుకువస్తారని నమ్ముతున్నాం, అక్కడ మీ బిడ్డలే ఉంటే ఏం చేసేవారు..? ఇప్పటికే 80 రోజులు గడిచాయి. ఒక్కో నిమిషం నరకంలా అనిపిస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  దాంతో బందీలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు చేపడుతూనే ఉందని నెతన్యాహు వెల్లడించారు.
 
బందీల విడుదలకు సహకరించమని తాను స్వయంగా రష్యా, చైనా అధ్యక్షులతో మాట్లాడానని, తన భార్య పొప్ జోక్యం కోరిందని ఆయన తెలిపారు. మనకు మరో భూమి, మరో మార్గం లేదని, అందుకనే విజయం సాధించేవరకు ఈ యుద్ధం కొనసాగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.  తాను ఇప్పటికే బాధిత కుటుంబాలతో సమావేశమై వారి బాధలు విన్నానని గుర్తు చేశారు. 
 
కాగా, మధ్యమధ్యలో యుద్ధానికి స్వల్ప విరామాలు ఇవ్వడంతో కొంతమంది బందీలు విడుదలైనప్పటికీ ఇంకా 129 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది. పార్లమెంట్‌ స్పెషల్‌ సెషన్‌లో ప్రసంగానికి ముందు నెతన్యాహు గాజాలో పర్యటించారు.  యుద్ధానికి విరామం ఇస్తారంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలను ఈ సందర్భంగా ఆయన కొట్టిపారేశారు. తాము యుద్ధాన్ని ముగించడం లేదని స్పష్టం చేశారు. సైనికపరంగా ఒత్తిడి ఉంటేనే బందీల విడుదల సాధ్యమవుతుందని తెలిపారు. హమాస్‌ గ్రూప్‌ అంతం కాకుండా శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.