బ్రిగేడియర్ స్థాయి అధికారి తొలగింపు

బ్రిగేడియర్ స్థాయి అధికారి తొలగింపు
 
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో ముగ్గురు పౌరుల మరణాలపై ఆర్మీ అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారిని విధుల నుంచి తొలగించారు. ఆ అధికారిని పూంచ్ నుంచి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.  కొంతమంది మిలటరీ అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మరికొందరి అధికారుల పోస్టులు మారనున్నట్లు వెల్లడించాయి.

కాగా, గత వారం పూంచ్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు బఫ్లియాజ్ ప్రాంతానికి చెందిన సుమారు 15 మందిని ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. 

ముగ్గురు పౌరులైన మహ్మద్ సఫీర్, షబీర్ అహ్మద్, షోకత్ హుస్సేన్ ఆర్మీ నిర్బంధంలో ఉండగా మరణించారు. గాయపడిన సుమారు 12 మంది గ్రామస్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న గ్రామస్తులను సైనికులు కొట్టి చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

దీంతో ఆర్మీ జవాన్ల చిత్రహింసలు కారణంగా ముగ్గురు పౌరులు మరణించగా పలువురు గాయపడినట్లు గ్రామస్తులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు పౌరుల మరణంపై సమగ్ర దర్యాప్తునకు ఆర్మీ ఆదేశించింది. వారి వయస్సు 27 నుండి 47 సంవత్సరాల వరకు ఉంది.  మృతుల కుటుంభాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంతో పాటు, వారి కుటుంబాలలో ఒకొక్కరికి ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఉగ్రవాదుల దాడులు పెరుగడం, పలువురు సైనికులు చనిపోవడం, పౌరుల మరణాలపై ఆరోపణలు వంటి పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సోమవారం జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే ఉగ్రవాదుల దాడులు జరిగిన ప్రాంతాలను ఆయన సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.