
ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కేరళలో బయటపడిన జేఎన్.1 తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపింది. జేఎన్.1 వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది.
జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని వివరించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
కాగా, దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది. ఇక 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
కరోనా కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆరోగ్య సదుపాయాల కల్పన, అంటువ్యాధుల నివారణ చర్యలపై ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని,ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు.
అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్ వంటివి నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
More Stories
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం