పార్లమెంట్‌లో జరిగింది దురదృష్టకరమైన ఘటన

పార్లమెంట్‌లో జరిగింది దురదృష్టకరమైన ఘటన
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ కొందరు యువకులు పార్లమెంట్‌లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా అభివర్ణించారు.  ఈ ఘటనను అందరూ ఖండించాలని.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఘటన తీవ్రత దృష్ట్యానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారని ప్రధాని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటి వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, వాటికి పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని మోదీ తెలిపారు. పరిష్కారం కోసం అందరూ ఓపెన్ మైండ్‌తో ఆలోచన చేయాలని ఆయన సూచించారు.
 

‘దైనిక్‌ జాగరణ్‌ ’ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన అంశమని చెబుతూ  స్పీకర్‌ తగిన చర్యలు తీసుకుంటున్నారని, దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయని గుర్తు చేశారు. దీని వెనుక ఉన్న కుట్రలు, వాటి లక్ష్యాలు తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొంటూ దీనిపై పార్లమెంట్ లో చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, సమగ్ర విచారణ జరగాలని చెప్పారు.

ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉంటే బాగుంటుందని ప్రధాని హితవు చెప్పారు. అంతకుముందు, లోక్‌సభలో  భద్రతా లోపంపై సీరియస్‌గా వ్యవహరించాలని సీనియర్ మంత్రులను మోదీ ఆదేశించారు. ఈ అంశంపై సమష్టిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, లోక్‌సభలో భద్రత సెక్రటేరియట్‌ పరిధిలో ఉందని, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొనడం గమనార్హం.

కాగా, 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే రోజున అంటే 2023 డిసెంబర్‌ 13న ఆరుగురు యువకులు పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇద్దరు పార్లమెంట్ లోపల, ఇద్దరు పార్లమెంట్ వెలుపల కలర్‌ గ్యాస్ డబ్బాలతో హంగామా చేశారు. కాసేపు గందరగోళం సృష్టించారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.