బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళను కొట్టిన బంధువు

బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళను కొట్టిన బంధువు
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ఓ ముస్లిం మహిళను ఆమె బంధువు కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ ముస్లిం మహిళను కలిశారు. ఆమెకు భద్రత కల్పిస్తానని భరోసా ఇచ్చారు. 
 
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచింది. దీంతో అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సమీనా బీ బీజేపీ సంబరాల్లో పాల్గొంది. ఇది చూసి బావ జావేద్ ఖాన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను బీజేపీకి ఓటు వేసినట్లు ఆమె చెప్పడంతో కర్రతో కొట్టాడు. 
 
గాయపడిన సమీనా దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ వద్దకు కూడా ఆమె వెళ్లింది. తనను కొట్టడంతోపాటు బెదిరిస్తున్న బావపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు భద్రత కల్పించాలని కోరింది.  కాగా, సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో సమీనా బీని ఆయన పిలిపించారు.
ఈ నేపథ్యంలో శనివారం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి చౌహాన్‌ అధికారిక గృహానికి వెళ్లి ఆయనను కలిసింది. బీజేపీకి ఓటు వేసినందుకు బావ తనను కొట్టినట్లు ఆరోపించింది.  తనకు భద్రత కల్పిస్తామని సీఎం చౌహాన్‌ హామీ ఇచ్చినట్లు అనంతరం సమీనా తెలిపింది. చౌహాన్ ఏ తప్పు చేయలేదని, అందుకే బీజేపీకి తాను ఓటు వేసినట్లు చెప్పింది. ఇకపై కూడా బీజేపీకి ఓటు వేస్తానని చౌహాన్‌తో అన్నట్లు మీడియాకు వెల్లడించింది.