
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై శుక్రవారం మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కు రప్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అంటూ ఎక్స్ వేదికగా అవినీతికి పాల్పడే వారిపై స్పందించారు. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపి ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి రూ. 200 కోట్ల నగదును ఆదాయం పన్ను స్వాధీనం చేసుకున్న సంఘటనకు సంబంధించిన పత్రికా కథనాన్ని ప్రధాని మోదీ తన పోస్టుకు జతచేశారు.
ఈ కరెన్సీ నోట్ల గుట్టలను దేశ ప్రజలందరూ చూసిన తర్వాత నిజాయితీపై ఆ పార్టీ(కాంగ్రెస్) నాయకులు చెప్పే ఉపన్యాసాలను వినాలి. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసా వాపసు చేయాల్సిందే. ఇది మోదీ గ్యారంటీ అంటూ వివిధ రకాల ఇమోజీలతో మోడీ హెచ్చరించారు. కరెన్సీ నోట్ల కట్టలతో నిండిపోయిన అనేక బీరువాల ఫోటోను కూడా ఆ పత్రికా కథనంలో పొందుపరిచారు.
కాగా..లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎక్స్ అక్షర యుద్ధాన్ని ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న విచ్ఛిన్నకర కుట్రలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా చురకలు అంటించారు.
70 ఏళ్ల అలవాట్లు అంత త్వరగా వదులుకోలేరంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం నుండి సాహుకు చెందిన ఒడిశా, జార్ఖండ్ నివాసాల్లో ఐటి శాఖ సోదాలు చేపడుతున్నారు. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి.
నగదు స్వాధీనం చేసుకున్న ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన పలు ప్రదేశాల్లో దాడులు కొనసాగుతున్నట్లు ఐటి శాఖ శుక్రవారం తెలిపింది. సంబల్ పూర్, బోలంగీర్, తితిలాగఢ్, బౌధ్, సుందర్‌ఘర్, రూర్కెలా, భువనేశ్వర్‌లలో దాడులు జరుగుతున్నాయి. పట్టుబడిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్, 30 మందికి పైగా అధికారులను వినియోగిస్తున్నట్లు ఐటి అధికారులు తెలిపారు.
భువనేశ్వర్ లో జరుగుతున్న దాడులను ఐటి డైరెక్టర్ సంజయ్ బహదూర్ పర్యవేక్షిస్తున్నారు. సుందర్‌ఘర్ సిటీలోని లిక్కర్ కంపెనీ, భువనేశ్వర్‌లోని బిడిపిఎల్ కార్పోరేట్ ఆఫీస్, రాణిసాటి రైస్‌మిల్ కంపెనీల్లోనూ సోదాలు చేపడుతున్నట్లు తెలిపారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు