
`బీహార్ డీఎన్ఏ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాతీయ స్థాయి నాయకులు మండిపడుతున్నారు. బీహార్ డీఎన్ఏను కాదని తెలంగాణ డీఎన్ఏను ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీహార్ ప్రజలను కించపరిచేలా రేవంత్ వ్యాఖ్యానించారని ఆ రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై జేడీయూ నేత నీరజ్ కుమార్ స్పందిస్తూ2015 ఎన్నికల్లో ప్రధాని మోదీ కూడా ఈ విధంగా మాట్లాడి, బీహార్‌లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ఈ దేశంలో తెలంగాణ డీఎన్ఏ, బీహార్ డీఎన్ఏ ఉండదు.. అందరిలో హిందూస్థాన్ డీఎన్ఏనే ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇండియా కూటమి మరింత బలోపేతం అవుతుందని ఆయన అనుకుంటున్నారా..? అని నీరజ్ కుమార్ ప్రశ్నించారు.
బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఇండియా కూటమి ఖండించాలని, అతనితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా..? అసలు ఇండియా కూటమి సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు..? రేవంత్ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ ఎందుకు నోరు విప్పడం లేదు..? బీహార్‌లోని కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి ఎంపీ సుశీల్ మోదీ సహితం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్ ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి సభ్యులు అవమానిస్తూనే ఉన్నారంటూ బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ గొప్పదని మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం