ఇథనాల్‌ తయారీలో చెరకు రసం ఉపయోగించవద్దు

ఇథనాల్‌ తయారీలో చెరకు రసం ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం చక్కెర మిల్లులు, డిస్టిలరీలను కోరింది. ఈ మేరకు గురువారం నాడు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు లేఖ రాసింది. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

చెరకు ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో ఈ సారి సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తగ్గింది. దీంతో చక్కెర ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. దీంతో దేశీయంగా షుగర్‌ అందుబాటులో ఉం డేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ తయారీకి చెరకు రసాన్ని, షుగర్‌ సిరప్‌ వాడకాన్ని నిలిపివేయాలిని కేంద్రం ఈ లేఖలో కోరింది.

అయితే, బి-హెవీ మొలాసిస్‌కు మినహాయింపు ఇచ్చింది. ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలకు బి-హెవీ మోలాసిస్‌ నుంచి తీసిన సప్లయ్‌ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో డిమాండ్‌-సప్లయ్‌ తీరును పరిశీలించిన మంత్రుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంది. 

ఈ సంవత్సరం ప్రధానంగా షుగర్‌ ఉత్పత్తిపై ఎక్కువ కేంద్రీకరించాలని కమిటీ నిర్ణయించింది. షుగర్‌ మిల్లులకు కేవలం సీ-హెవీ మోలాసిస్‌ను ఉత్పత్తి చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 2023-24 సంవత్సరం ఇథనాల్‌ సేకరణ ఈ నవంబర్‌ 1 నుంచి ప్రారంభమైంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో దీన్ని సమీక్షించనున్నారు. 

చమురు కంపెనీలతో ఒప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు కొనసాగుతాయి. ఇథనాల్‌ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, తాజా నిర్ణయంతో ఈ కంపెనీలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

అయితీ ఇది తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని, చెరకు ఉత్పత్తి పెరిగితే మళ్లి ఇథనాల్‌ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2023-24 సంవత్సరంలో షుగర్‌ ఉత్పత్తి 8 శాతం వరకు తగ్గి 33.7 మిలియన్‌ టన్నులు వచ్చే అవకాశం ఉందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. 14 సంవత్సరాల తరువాత దేశంలో షుగర్‌ ఉత్పత్తి తగ్గనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.