హిందూ ఆలయాల పవిత్రతను మంట గలుపుతున్న పాకిస్థాన్

 ఆలయాలు అంటే.. కేవలం దేవుడు, దైవభక్తికి నిలయాలే కాదు.. ముక్తిపథమార్గానికి సాధనాలుగా పేర్కొనబడ్డాయి. ఒకప్పుడు భారత్ లో అంతర్భాగంగా ఉన్న నేటి పాకిస్తాన్ లో ఎన్నో చారిత్రక ఆలయాలున్నాయి. కానీ దేశవిభజన తర్వాత అది ముస్లీం పాలకుల చేతుల్లోకి వెళ్లిపోవడం.. అక్కడ హిందువులు మైనార్టీలుగా మారిపోవడంతో.. హిందువులకు, సనాతన ధర్మానికి రక్షణ లేకుండా పోయింది.
హిందువులపై మితిమీరిన ద్వేషంతో.. వారిపై దాడులు చేయడమే కాకుండా అక్కడున్న చారిత్రక ఆలయాలను ధ్వంసం చేశారు. ఒకనాడు ఎందరో పురుణాపురుషులు, రుషులు, మహానుభావులతో పూజించబడిన ఆలయాలు సైతం.. నేడు చెప్పుకోడానికి వీలులేని పరిస్థితిలో పశువుల కొట్టాల్లా మారిపోయాయి. పాకిస్తాన్ లో.. శతాబ్దాల చరిత్ర, మతపరమైన ప్రాముఖ్యతను సంతరించుకున్న ఆలయాలు.. పాడుబడిన, శిథిలావస్థలో ఉండి, అశుద్ధ కార్యకలాపాలకు వినియోగిస్తూ, అగౌరవపరుస్తున్న దృశ్యాలు హిందువులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.
అందులో ఒకటి వరుణ్ దేవ్ మందిర్. కరాచీలోని మనోరా బీచ్ కు దగ్గరగా ఉన్న ఈ హిందూఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. చాలాకాలం వరకు పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యాజమాన్యంలో ఉంది. కానీ దుండగులు దీన్ని ధ్వంసం చేశారు. గర్బగుడిలో విగ్రహాలు తొలగించారు. ప్రస్తుతం దీనిని అత్యంత దారుణంగా.. పబ్లిక్ టాయ్‌లెట్ గా మార్చేశారు. ఒకప్పుడు నిర్మాణ కౌశలానికి, హస్తకళా నైపుణ్యానికి నెలవుగా ఉన్న ఈ ఆలయం.. నేడు పూర్తిగా అపవిత్రం అయిపోయింది.
1950 వరకు ఈ ఆలయం భక్తుల దర్శనాలు చేసుకునే అవకాశం ఉండేది. రద్దీ పెరగడం, ఆలయం పురాతనంగా మారిపోవడంతో.. పున:నిర్మించారు కూడా. కానీ.. తర్వాతి కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ పురాతన హిందూ దేవాలయాన్ని టూరిస్ట్ టాయిలెట్‌గా మార్చడాన్ని.. మత వైవిధ్యాన్ని గౌరవించడంలో మరియు సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడంలో పాకిస్తాన్ ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తు చేస్తోంది.
పంజాబ్ ప్రావిన్స్ లోని అహ్మద్‌పూర్‌లోని మరో చారిత్రక ఆలయం.. ఏకంగా పశువుల పాకగా మార్చేశారు. ఈ స్థలం మాత్రం మోహన్ భగత్ అనే హిందువుకు చెందినదిగా ఉన్నా.. అతను మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఇది స్థానికంగా ఉన్న ముస్లీంలు పశువుల కొట్టంలా మార్చేశారు. ఈ ఆలయ చరిత్ర గురించిన మిగతా వివరాలు తెలియరాలేదు.
సేవ్ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఈ రెండు ఆలయాల దురవస్థ గురించి వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే.. పాకిస్తాన్ లో హిందువులు, హిందూ దేవాలయాల దీనస్థితిని వెల్లడిస్తోంది. ఇలాంటి మరెన్నో ఆలయాలు కూడా పాకిస్తాన్ లో తీవ్ర అగౌరవానికి గురవుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు భారత్ తో పాటు.. ప్రపంచదేశాలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.