హమాస్‌ సొరంగాల్లోకి సముద్రపు నీరు పంపనున్న ఇజ్రాయిల్!

హమాస్ కు చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా గాజా స్ట్రిప్‌పై పూర్తిస్థాయిలో ఇజ్రాయెల్‌ సైన్యం పట్టుబిగించింది. ఇజ్రాయెల్‌ నిర్వహించిన దాడుల్లో హమాస్‌ సొరంగాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సొరంగాలు ఇజ్రాయెల్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో వాటిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందించింది. 
 
ఇందులో భాగంగా సొరంగాలను సముద్రపు నీటితో నింపేందుకు రంగం సిద్ధం చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. నవంబర్‌ మధ్యలోనే ఇజ్రాయెల్‌ సైన్యం అల్‌ షాతి శరణార్థి శిబిరానికి ఉత్తరాన ఓ మైలు దూరంలో ఐదు పంపులను ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇవి గంటకు వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని పంప్‌ చేస్తాయని, వారాల్లోనే సుమారు 800 సొరంగాలను నీటితో ముంచేస్తాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీల్‌ జర్నల్‌ పేర్కొంది.
 
బందీలను విడుదల చేసుకునేందుకు పంపులను వినియోగించాలని చూస్తుందా? అనేది స్పష్టంగా తెలియరాలేదు.  గతంలో బందీలను సొరంగాల్లో సురక్షితంగా ఉంచినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, గాజా స్ట్రిప్‌లో హమాస్‌ నిర్మించిన విస్తారమైన నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు నీటితో నింపాలనే ఇజ్రాయెల్‌ భారీ పంపులను సమీకరించినట్లు భావిస్తున్నారు.సొరంగాలను నాశనం చేయడం ద్వారా హమాస్‌ యోధులను భూగర్భాల్లో దాక్కున్న సొరంగాల నుంచి బయటకు రప్పించేందుకు నీటిని నింపాలని పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై అమెరికా అధికారులను సంప్రదించగా  సొరంగాలను పనికిరాకుండా చేయడమే దీనికి అర్థమని, ఇందుకు ఇజ్రాయెల్‌ అనేక మార్గాలను అన్వేషిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. 

కాగా, దీనిపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారి సైతం స్పందించేందుకు నిరాకరించారు. అయితే, ఇప్పటికే రక్షిత నీటి కొరతను  ఎదుర్కొంటున్న గాజాలో సొరంగాలలోకి సముద్రపు నీటిని పంపితే అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులు కూడా పనికిరాకుండా పోయే ప్రమాదముంది.

మంచినీటి కోసం గాజా ఇజ్రాయిల్ నుండి మూడు పైప్ లైన్ ల నుండి  వచ్చే నీటిపై ఆధారపడుతుంది. అయితే యుద్ధం కారణంగా ఒక పైప్ లైన్ ఇప్పటికే మూతపడింది. మిగిలిన రెండు పైప్ లైన్ లలో కూడా పరిమితంగానే నీరు వస్తున్నది. ఒకొక్క మనిషికి రోజుకు కనీసం 15 లీటర్ల నీరు అవసరమని ఐక్యరాజ్యసమితి సిఫార్సు చేయగా, ప్రస్తుతం పాలస్తీనియన్లకు కేవలం 3 లీటర్లు చొప్పున మాత్రమే అందుబాటులో ఉంది.