ఆస్ట్రేలియాను మరోసారి చిత్తుగా ఓడించిన భారత్

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తుండగా వాళ్లు వాటిని రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా ఆ ఓటమి నుంచి తేరుకొని టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్నది. 

విశాఖపట్నంలో జరిగిన తొలి పోరులో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌  ఆదివారం తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. 

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందేమో అని భావిస్ మన టాపార్డర్‌ మైదానంలో పరుగుల సునామీ సృష్టించింది. యశస్వి జైస్వాల్‌ (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా  కెప్టెన్‌ సూర్యకుమార్‌ (19; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (9 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో భారీ షాట్లతో చెలరేగిపోయారు. 

ముఖ్యంగా నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న రింకూ సింగ్‌ భారీ షాట్లోతో శివతాండవమాడాడు. తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్‌) ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలీస్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 

మార్కస్‌ స్టొయినిస్‌ (45) టాప్‌ స్కోరర్‌ కాగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. గత మ్యాచ్‌ సెంచరీ హీరో ఎలీస్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరగా,  స్మిత్‌ (19), షార్ట్‌ (19), మ్యాక్స్‌వెల్‌ (12) ఎక్కువసేపు నిలువలేకపోయారు. టిమ్‌ డేవిడ్‌ (37), కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (42 నాటౌట్‌) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవి, ప్రసిద్ధ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. యశస్వికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం గువాహటిలో మూడో టీ20 జరగనుంది.

భారత ఇన్నింగ్స్‌కు యశస్వి మెరుపు ఆరంభాన్నిస్తే.. రింకూ తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అబాట్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో యశస్వి వరుసగా 4,4,4,6,6తో 24 పరుగులు పిండుకుంటే.. అదే అబాట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో రింకూ సింగ్‌ 4,6,4,4,6తో 25 పరుగులు రాబట్టాడు.