న్యుమోనియా కేసులపై కేంద్రం కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు

న్యుమోనియా కేసులపై కేంద్రం కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు
చైనాలో న్యుమోనియా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు సిద్ధం చేయాల‌ని రాష్ట్రాల‌ను కేంద్రం కోరింది. ఎలాంటి ప‌రిస్ధితి ఎదురైనా అధిగ‌మించేందుకు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాల‌కు సూచించింది. 
 
చైనాలో న్యుమోనియా కేసులు ప్ర‌బ‌లుతుండ‌టంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆస్ప‌త్రుల్లో త‌గిన ఏర్పాట్ల‌కు సంబంధించి స‌మీక్షించాల‌ని రాష్ట్రాల‌ను కోరింది. కరోనా సమయంలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించారో అదే తరహాలో ఉండాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా ఇన్ఫెక్షన్లు, సారీ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జాగ్రత్తగా గమనించాలని కేంద్రం ఆదేశించింది.
 
ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, సార్స్ కోవ్-2 లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల శ్వాసకోస సమస్యలు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది కాగా, గత కొన్ని రోజులుగా చైనాలో న్యుమోనియో తరహా కేసులు విపరీతంగా నమోదవుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని క‌ధ‌నాలు వ‌చ్చాయి. చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని స‌మాచారం. మ‌రోవైపు చైనాలో కొత్త ర‌కం వైర‌స్ వ్యాపించింద‌నే వార్త‌ల‌ను డ్రాగ‌న్ తోసిపుచ్చింది. ఇవి సీజ‌న‌ల్ శ్వాస‌కోశ స‌మ‌స్యేల‌న‌ని చైనా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఇక చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఏదేమైనా భారత్‌కు న్యుమోనియా ముప్పు తక్కువేనని కేంద్రం ప్ర‌క‌టించ‌డం కొంత ఊర‌ట క‌లిగిస్తోంది.

చైనాలో అంతుచిక్కని నిమోనియాలో సరికొత్త వైరస్‌ ఏమీ లేదని అక్కడి ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిశీలన చేపట్టింది. చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ను సంప్రదించింది. బీజింగ్‌, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎలాంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని స్పష్టం చేసింది.