కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

కేరళలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కోచి నగర శివార్లలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ బాధితుల ఆర్తనాదాలు, అంబులెన్స్‌ల సైరన్లతో ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. యూనివర్సిటీలో కొన్ని రోజులుగా టెక్ ఫెస్ట్ జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం మ్యూజిక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. ప్లేబాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ మ్యూజిక్ ఫెస్ట్ ప్రాంగణం పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినీ విద్యార్థులలో కిక్కిరిసిపోయింది. 

దీనికి టికెట్లు పెట్టడంతో టికెట్లు తీసుకున్నవారు లోపల, పలువురు ఆడిటోరియం బయట ఉన్నారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా వర్షం పడటంతో ప్రేక్షకులు షెల్టరున్న స్టేజి వైపు తోసుకుని వెళ్లడంతో ఏం జరిగిందో, ఏమో గానీ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.  తోపులాటలో కిందపడిన విద్యార్థులను తొక్కుకుంటూ వెళ్లిపోయారు.

ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

 గాయపడిన వారిని కాలమాసెరీలోని ఎర్నాకుళం మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంత మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జరిగిన తొక్కిసలాట తన హృదయాన్ని కలచివేసిందని ప్రముఖ గాయని నిఖితా గాంధీ తెలిపారు.  తాను వేదికపైకి వెళ్లేలోపే తొక్కిసలాట చోటుచేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేయడానికి పదాలు సరిపోవని ఆమె తెలిపారు. విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని వెల్లడించారు.