సూర్యుడికి మరింత చేరువగా ఆదిత్య ఎల్-1

చంద్రయాన్ 3 తర్వాత సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యత ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ చేపట్టింది. ఆదిత్య ఎల్‌-1 త్వరలోనే లక్ష్యాన్ని చేరనున్నదని ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ఆదిత్య సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని, సాఫీగా చివరి దశకు చేరుకుంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
జనవరి 7 కల్లా ఆదిత్య ఎల్‌-1 తుది విన్యాసాన్ని చేపట్టి ఎల్‌-1 పాయింట్‌లోకి చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.  కాగా, సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ అంతరిక్ష నౌక 125 రోజుల్లో దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యుడికి సమీపంలోని లాగ్రేంజియన్‌ పాయింట్‌ను చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం నిర్వహిస్తూ ఉంటుంది. 

ఆదిత్య-ఎల్‌1 సూర్యుడి లాగ్రేంజియన్‌ పాయింట్ నుంచి చిత్రాలను తీసి భూమికి పంపుతుంది. ఇక ఆదిత్య ఎల్‌-1 నౌక సూర్యుడు, భూమికి మధ్య ఉన్న ఎల్‌-1 పాయింట్‌ దగ్గరలోని ‘హాలో ఆర్బిట్‌లో తిరుగుతుంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యుడికి సంబంధించి ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలను తీసి ఇస్రోకు చేరవేస్తుంది. 

ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మూసుకెళ్లగా విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ తో పాటు సోలార్‌ అల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటో మీటర్లు ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై అధ్యయనం చేసేందుకు అవసరమైన డేటాను అందించనున్నాయి.