భారతదేశానికి పెళ్ళికళ.. ఈ సీజన్‌లో 38 లక్షల వివాహాలు..

భారతదేశానికి పెళ్ళికళ.. ఈ సీజన్‌లో 38 లక్షల వివాహాలు..

దేశానికి పెళ్లికళ వచ్చింది. రానున్న రోజుల్లో లక్షలాదిగా జంటలు ఒక్కటి కానున్నాయి. గత జూన్ లో పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ నవంబర్ లోనే పెద్దసంఖ్యలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆషాఢం, అధికమాసంతో పాటు.. శ్రావణమాసంలో ముహూర్తాలు తక్కువగా ఉండటంతో.. చాలామంది తమ వివాహాలను నవంబర్ కు వాయిదా వేసుకున్నారు. ఫలితంగా.. దాదాపు 5 నెలల తర్వాత పెళ్లిసందడి మొదలైంది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా ఏకంగా 38 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 4.74 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయని.. వ్యాపారుల జాతీయ సమాఖ్య కొత్త గణాంకాలను విడుదల చేసింది.
నవంబర్ 16 నుంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఆనాటి నుంచి 18,24,28,29 తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. అలాగే డిసెంబర్ లో కూడా తొలి రెండు వారాలు వివాహాలకు అనుకూలంగా ఉండటంతో.. లక్షల సంఖ్యలో కళ్యాణాలు కానున్నాయి. డిసెంబర్ 3 వ వారం నుంచి సంక్రాంతి వెళ్లే వరకు ముహూర్తాలు లేకపోవడం.. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలు దాటితే.. మళ్లీ కార్తీకమాసం వరకు ముహూర్తాలు లేకపోవడంతో.. పెళ్లిళ్లకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నారు. దీంతో శోభకృత్ నామ సంవత్సరం, కార్తీకమాసం అన్నీ కలిసి వచ్చేలా.. నవంబర్ లోనే మూడుముళ్లు వేసుకునేందుకు, ఏడడుగులు నడిచేందుకు త్వరపడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ దఫా 4 లక్షల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని.. ఇందుకోసం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు జరగనుందని గణాంకాలు వెల్లడించాయి. ఢిల్లీతో పాటు.. ముంబై, కోల్ కతా సహా.. 30 నగరాలతో ఆడంబరాలతో కూడిన వివాహాలు జరుగుతాయని స్పష్టం చేశాయి. ఈ సీజన్ లో కోటికి పైగా ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు 50 వేలకు పైగా ఉన్నాయని.. వ్యాపారుల జాతీయ సమాఖ్య పేర్కొంది. అలాగే రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ ఖర్చుతో అయ్యే పెళ్లిళ్లు 60 వేల వరకు జరుగుతాయని, అలాగే రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టే పెళ్లిళ్లు ఏకంగా 7 లక్షల వరకు జరుగుతాయని తెలిపింది.
కొవిడ్ కారణంగా ఆడంబరాలకు వెళ్లనివారంతా.. ఇప్పుడిప్పుడే భారీగా ఖర్చు చేసేందుకు ఇష్టపడుతున్నారని సదరు సమాఖ్య వెల్లడించింది. ఈ ఏడాది దీపావళికి ప్రజలు రికార్డ్ స్థాయిలో ఖర్చు చేశారని.. దేశం మొత్తంమీద రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపింది. ఈ పెళ్లిళ్ల సీజన్ .. దీపావళి రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా కొత్త బట్టలు, నగలు, వెడ్డింగ్ ప్లానర్స్, ఎలక్ట్రికల్ లైటింగ్, ఫంక్షన్ హాల్స్, కేటరింగ్, ఫోటో వీడియోగ్రఫీ, మద్యం వంటి ఇతరత్రా ఖర్చుల వల్ల ఆయా రంగాల్లో కొనుగోళ్లు భారీగా ఉంటాయని తెలిపింది.
ఖర్చుకు వెనుకాడకుండా.. తమ వివాహాలను గ్రాండ్ గా చేసుకునేందుకు నేటి తరం ఇష్టపడుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వేడుకలను చూసి.. చాలా మంది తమ పెళ్లి వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలు కూడా తెలుగునాట కూడా కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లిళ్ల ఖర్చులు ఏయేటికాయేడు పెరిగిపోతున్నట్లు వివరిస్తున్నారు.