ఎసిబి వలలో జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత

జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ సోమవారం ఏసిబి వలలో చిక్కారు. వివరాల్లోకి వెళితే… లింగాల ఘనపురం మండలానికి చెందిన చిట్టిపెల్లి రాజు జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో నిర్మించిన భవనంలో బంకెట్ హాల్ అనుమతి కోసం మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఇందుకుగాను మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత రూ.50 వేల లంచం డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన ప్రకారం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత డ్రైవర్ అయిన నవీన్ కు ఆ డబ్బు అప్పగించేందుకు వచ్చారు. 
 
తమ పథకంలో భాగంగా అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ సాంబయ్య, ఇతర ఆఫీసర్లు రాజు రూ.40 వేలను నవీన్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డబ్బులు సీజ్ చేసి నవీన్ ను విచారించగా ఆయన అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. డ్రైవర్ నవీన్ వాంగ్మూలం తీసుకుని, కమిషనర్ లంచం డిమాండ్ చేసినట్లుగా నిర్ధారించారు.
 
అనంతరం మున్సిపల్ కమిషనర్ రజితతో పాటు డ్రైవర్ నవీన్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆఫీస్ రికార్డ్స్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. లంచం డబ్బుతో పట్టుబడిన ఇద్దరినీ మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ సాంబయ్య వివరించారు.