తెలంగాణాలో నిశబ్ద విప్లవం మాదిరిగా బిజెపికి మద్దతు

 
మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత తెలంగాణ ఎన్నికలలో బిజెపికి ఆదరణ పెరుగుతున్నదని  కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గో. కిషన్ రెడ్డి తెలిపారు.  అంచనాలకు మించి క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి బిజెపికి ఆదరణ, మద్దతు లభిస్తోందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు బిజెపి మద్దతుగా తరలివస్తున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవంలా చాలా నియోజకవర్గాల్లో బిజెపికి అనుకూలంగా స్పందిస్తున్నారని భరోసా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రచార రథాలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని, తెలంగాణలో దళితుడిని సీఎం చేయలేదని, రుణమాఫీ చేయలేదని, ధరణితో నష్టపోయామని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, గ్రామ పంచాయితీకి నిధులివ్వలేదు అంటూ బీఆర్ఎస్ నేతలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారని కిషన్ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గాంధీభవన్, ప్రగతిభవన్ దాటవని ఎద్దేవా చేశారు. దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తం తాగిందని పేర్కొంటూ 1969 ఉద్యమంలో 365 మంది విద్యార్థులను, మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానానికి కారణమైందని ఆరోపించారు.

అమలుకు నోచుకోని, చేతగాని, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇచ్చిన కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మట్లేదని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, బీజేపీ చెప్పిందే చేస్తుందని.. చేసేదే చెప్తామన్నారు.జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్.. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అవినీతి కుంభకోణాలతో ప్రజాధనాన్ని దోపిడీ చేశాయన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వల్ల తెలంగాణ నష్టపోయిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో  అమలు చేశారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే కెసిఆర్ హయాంలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోగా అక్రమాలకు అవకాశం లేకుండా, పారదర్శకతతో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువతను ఆదుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. వరికి రూ.3,100 మద్దతు ధర కల్పిస్తామని, ఎరువులపై ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 18 వేల చొప్పున సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువుల సబ్సిడీతో పాటు రూ.2,500 ఇన్ పుట్ అసిస్టెన్స్ కల్పిస్తామని పేర్కొన్నారు.