డీప్‌ఫేక్ వీడియో వంటి సాంకేతికపై పోలీసులు అప్రమత్తం కావాలి

నేరస్థులు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్)ను ఉపయోగించడాన్ని , డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోల సమస్యను రాష్ట్రపతి ద్రౌపది మేర్ము ప్రస్తావిస్తూ, పోలీసు అధికారులు నిరంతరం టెక్నాలజీ రంగంలో అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు. రాష్టరపతి భవన్‌లో శనివారం తనను కలిసిన 2022 బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్లనుద్దేశించి ఆమె మాట్లాడారు. 

 పోలీసు బలగాలకు సైబర్ నేరాలు, డ్రగ్స్ ముఠాలు, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం లాంటి అనేక సవాళ్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ‘కొత్త టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రవేశంతో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రత్యుత్పత్తి చేయగల కృత్రిమ మేధను క్రిమినల్స్ ఉపయోగించడం, డీప్ ఫేక్ లాంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి’ అని రాష్ట్రపతి తెలిపారు.

పోలీసు అధికారులు ఎల్లప్పుడూ టెక్నాలజీ రంగంలో అప్‌డేట్‌గా ఉండాలని, క్రిమిల్స్‌పై పైచేయిగా ఉండాలని ఆమె సూచించారు. పోలీసు పరిపాలన, శాంతిభద్రతల బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని ద్రౌపది ముర్ము చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే పోలీసు సిబ్బందికి ఐపిఎస్ అధికారులు తగిన నాయకత్వాన్ని అందించాలని ఆమె చెప్పారు. 

ఈ విధంగా దేశ పోలీసు వ్యవస్థను సంఘటితంగా ఉంచే బాధ్యత అఖిల భారత పోలీసు సర్వీసుపై ఉందని రాష్ట్రపతి అన్నట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. అమృత్‌కాల్‌లో భారత్‌ను అభివద్ధి చెందిన దేశంగా చేయాలన్న కృతనిశ్చయాన్ని నెరవేర్చడంలో పోలీసు అధికారులు నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కూడా ద్రౌపది ముర్ము తెలిపారు.

సామజిక, ఆర్థిక అభివృద్ధికి శాంతిభద్రతలను పటిష్టపరచడం అత్యవసరమని చెబుతూ ప్రశాంత పరిస్థితులు నెలకొన్న చోటనే అంతర్జాతీయంగా గాని, జాతీయంగా గాని, స్థానికంగా గాని ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ఆమె గుర్తు చేశారు. అందువల్లనే ఒక ప్రాంతపు బహుళ విధాలా అభివృద్ధిలో పోలీసులు క్రియాశీల పాత్ర వహిస్తారని ఆమె స్పష్టం చేశారు.

అదేవిధంగా దేశ సమగ్రత, సమైక్యతలను పరిరక్షించడంలో శాంతిభద్రతలు కీలకమని ఆమె చెప్పారు. ఈ విషయంలో కూడా పోలీసులపై గురుతర బాధ్యత ఉంటుందని చెప్పారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో పౌరులందరూ భాగస్వాములయ్యేటట్లు చూడడం మనందరి జాతీయ బాధ్యత అని రాష్ట్రపతి స్పష్టం చేశారు.