చంద్రుడిపైకి మరో మిషన్ కు ఇస్రో సిద్ధం

చంద్రుడి నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అంచనాలను మించి విజయవంతం  అయింది. ఈ ప్రాజెక్టు విజయంతో భారత్ పై ప్రపంచ దేశాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చంద్రయాన్ 3 ప్రయోగం తర్వాత చంద్రుడిపైకి వెళ్లకముందే రష్యా కూడా లూనా 25 పేరుతో ఓ విఫల ప్రయోగం చేసింది. 
 
కానీ భారత్ మాత్రం నాలుగు రోజులు ఆలస్యంగా అయినా విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టేసింది. చంద్రయాన్ 3 విజయవంతం తర్వాత చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు భారత అంతరిక్ష సంస్ధ (ఇస్రో) సిద్ధమవుతున్నది.  ఇందులో భాగంగా మరో నాలుగైదేళ్లలో చంద్రయాన్ 4 ప్రయోగం చేపట్టేందుకు వ్యూహరచన చేస్తుంది.
 
అయితే ఈసారి చంద్రుడిపై చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి శాంపిల్స్ సేకరణతో పాటు వాటిని భూమికి తిరిగి తెచ్చేలా ఈ ప్రయోగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇస్రో ఇప్పుడు ఒక పెద్ద మిషన్‌ను ప్లాన్ చేస్తోందని తాజాగా ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ) డైరెక్టర్ నీలేష్ దేశాయ్ పూణె పర్యటనలో వెల్లడించారు. 
 
ఇక్కడ తాము శివశక్తి పాయింట్ నుండి రాళ్లు లేదా మట్టి నమూనాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో ఈ సవాలును ఎదుర్కోగలమని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఇస్రో తాజా మిషన్ పై ఉత్కంఠ నెలకొంది.

 
ఈ మిషన్ లో ప్రధానంగా నాలుగు మాడ్యూల్‌లు ఉంటాయని తెలుస్తోంది. ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్, రీ-ఎంట్రీ మాడ్యూల్ ఉండబోతున్నట్లు సమాచారం. అందుకే ప్రతిపాదిత చంద్రయాన్ మిషన్‌లో రెండు వేర్వేరు ప్రయోగ వాహనాలు ఉంటాయి. ఇది ఇప్పటివరకు ఇస్రో యొక్క అన్ని మూన్ మిషన్‌ల కంటే విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.