మోదీపై విమర్శలకు ప్రియాంక, కేజ్రీవాల్‌లకు ఈసీ నోటీసులు

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత విమర్శలు చేసినందుకు డిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌,  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నవంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురు నేతలను ఆదేశించింది.
 
ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక చేసిన “తప్పుడు”, “నిర్ధారించని” వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. మోదీ  ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను (పిఎస్‌యు) ప్రైవేటీకరించిందని వాద్రా ఓ ర్యాలీలో పేర్కొన్నారని పార్టీ ఆరోపించింది.  ప్రధానమంత్రి తన పారిశ్రామికవేత్త స్నేహితులకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా బిహెచ్ఇఎల్ ని ఇచ్చారని ఆమె ఆరోపించింది.
 
“ఒక జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఆమె చేసిన ప్రకటనలు నిజమని ప్రజలు సాధారణంగా విశ్వసిస్తారు. అటువంటి నాయకురాలు చేసే ప్రకటనలు వాస్తవిక ఆధారాన్ని కలిగి ఉంటాయని కూడా భావిస్తారు. ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకుండా ఉండేందుకు మీరు పేర్కొన్న వాస్తవాలను ధృవీకరించి ఉండాలి” అని కమిషన్ మంగళవారం జారీ చేసిన నోటీసులో కాంగ్రెస్ నాయకురాలికి తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకరాకు ఈసీ జారీ చేసిన రెండో నోటీసు ఇది.
 
కాగా, మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో “చాలా ఆమోదయోగ్యం కాని”, “అనైతిక” వీడియో క్లిప్, వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఆప్పై చర్య తీసుకోవాలని బిజెపి మరో ఫిర్యాదులో ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేసింది.
 
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, పార్టీ జాతీయ మీడియా ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని, పార్టీ నాయకుడు ఓం పాఠక్‌లతో కూడిన బిజెపి ప్రతినిధి బృందం నవంబర్ 10న ఎన్నికల సంఘాన్ని ఈ విషయమై సంప్రదించింది. నవంబర్ 8న ఆప్ ఎక్స్ లో చేసిన పోస్ట్ లో మోదీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కోసం పనిచేస్తున్నారు గాని ప్రజల కోసం కాదంటూ పేర్కొన్నారు.
 
“ఒక జాతీయ పార్టీ అటువంటి కంటెంట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ప్రచురించి, ప్రచారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించడం ద్వారా జాగ్రత్త వహించాలని భావిస్తున్నాము” అని కమిషన్ మంగళవారం కేజ్రీవాల్‌కు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పార్టీపై తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని ఆప్ నాయకుడిని పోల్ ప్యానెల్ కోరింది.
 
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఇందుమూలంగా, మరొక జాతీయ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ (ప్రధాని మోదీ)కి వ్యతిరేకంగా, రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపించిన సోషల్ మీడియా పోస్ట్‌లలో చేసిన ప్రకటనలు/ఆరోపణలు/విరోధాలను వివరించవలసిందిగా కమిషన్ కోరింది. నిర్ణీత గడువులోగా ఆప్ నుండి స్పందన రాకపోతే, పార్టీకి తదుపరి సూచన చేయకుండా తగిన చర్య లేదా నిర్ణయం తీసుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.