బిఆర్ఎస్ ఎంపీలకు రాజ్యసభ సభాహక్కుల నోటీసులు

బీఆర్ఎస్ సభ్యులకు రాజ్యసభ సభా హక్కుల నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించారనే ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 28వ తేదీ లోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ ఛైర్మన్ జగదేవ్  ధన్‌కర్‌ నోటీసుల్లో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సభలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో తదుపరి చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, సురేష్ రెడ్డిలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. కే కేశవరావు, సురేష్ రెడ్డితోపాటు వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, దామోదర్ రావులు నోటీసులు అందుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సభలో నిరసనలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారని, ఇది ఏర్పాటు చేసిన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య జరిగింది. 
 
బీఆర్‌ఎస్ ఎంపీల ప్రవర్తన వల్ల కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కార్యకలాపాల్లో అనవసరమైన ఆటంకాలు ఏర్పడి కౌన్సిల్ గౌరవాన్ని తగ్గించాయని ఠాకూర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును చైర్మన్ పరిశీలించి తదుపరి పరిశీలన, విచారణ, నివేదిక కోసం అక్టోబర్ 17న ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేశారు.