గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన చిరుధాన్యాలపై మోదీ పాట

గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన చిరుధాన్యాలపై మోదీ పాట

చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రపంచానికి చాటి చెప్పే నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇండియన్‌-అమెరికన్‌ గాయని ఫలూ అలియాస్‌ ఫల్గుని షా సంయుక్తంగా రూపొందించిన ‘అబాండన్స్‌ ఇన్‌ మిల్లెట్స్‌’ గీతం బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పెర్‌ఫామెన్స్‌ కేటగిరి కింద గ్రామీ అవార్డులకు నామినేట్‌ అయ్యిందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఇదే కేటగిరి కింద అరూజ్‌ అఫ్తాబ్‌, విజయ్‌ అయ్యర్‌, షెహజాద్‌ ఇస్మాయిలీ (‘షాడో ఫోర్సెస్‌’), బుర్నా బాయ్‌ (‘అలోన్‌’), డేవిడో (‘ఫీల్‌’), సిల్వానా ఎస్ట్రాడా (‘మిలగ్రో వై డిసాస్ట్రే’), ఎడ్‌గర్‌ మేయెర్‌, జాకిర్‌ హుస్సేన్‌, రాకేష్‌ చౌరాసియా (‘పాష్టో’), ఇబ్రహీమ్‌ మాలూఫ్‌ (‘టోడో కొలోరెస్‌’)లు కూడా  నామినేట్‌ అయ్యారు.

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలనే ప్రతిపాదనను భారత్‌ చేసింది. సదరు ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సభ్యులు, ఐరాస సర్వసభ్య సమావేశం(యూఎన్‌జీఏ) ఆమోదం తెలిపారు. ”ప్రధాని నరేంద్ర మోదీ నాతో, నా భర్త గౌరవ్‌ షాతో కలిసి ఆ పాటను రచించారు” అని ఈ ఏడాది మొదట్లో పాటను విడుదల చేయడానికి ముందు ఫలూ పేర్కొన్నారు.

ప్రస్తుతం గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ  ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసారు. ఆకలికి ముగింపు పలకాలనే సందేశంతో ఒక పాట రాయాలని ప్రధాని మోదీ  తనను కోరారని ఫలూ తెలిపారు. అయితే తమతో కలిసి పాట రాస్తారా? అని ప్రధాన మంత్రిని అడిగినప్పుడు అందుకు ఆయన అంగీకరించారని ఆమె చెప్పారు.