ప్రధాన సమాచార కమిషనర్‌గా హీరాలాల్ సామరియా

ప్రధాన సమాచార కమిషనర్‌గా హీరాలాల్ సామరియా
తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి హీరాలాల్ సామరియా కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా నీయమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు.  ఉపరాష్ట్రపతి జగదేవ్ ధంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా నియామకంతో సీఐసీగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సమారియా నిలిచారు.
 
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఏర్పాటైన కమిటీ హీరాలాల్ సామరియా పేరును ఎంపిక చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వీకే తివారీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంది రామలింగం‌ను సమాచార కమిషనర్లుగా నియమించింది.

రాజస్థాన్‌‌లోని భరత్‌పూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో సమరియా జన్మించారు. 1985 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి హీరాలాల్ సామరియా. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు అలాట్ అయ్యారు. పలు కీలక పదవుల్లో పని చేశారు.  ఉమ్మడి ఏపీలో గుంటూరు కలెక్టర్‌గా, సదరన్ డిస్కం, ట్రాన్స్‌కో సీఎండీగా, ఎక్సైజ్, వాణిజ్య పన్ను శాఖల కమిషనర్‌గా పలు హోదాల్లో ఆయన పని చేశారు. రిటైర్ అయ్యే సమయానికి తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 

పదవీ విరమణ అనంతరం ఆయనను కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎంపిక చేసింది మోదీ నేతృత్వంలోని కమిటీ.  అక్టోబర్ 3న వైకే సింగ్ పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉన్న సీఐసీ పదవికి 63 ఏళ్ల సమరియా ఎంపికయ్యారు. సీఐసీలో సమాచార కమిషనర్‌గా 2020 నవంబర్ 7న ఆయన ప్రమాణస్వీకారం చేసారు. కాగా, సీఐసీ, సమాచార కమిషనర్ల పదవీ కాలం.  65 ఏళ్ల వరకూ ఉంటుంది. 

కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ), రాష్త్ర సమాచార కమిషన్లలో (ఎస్ఐసీలు) ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజా నియామాకం జరిగింది. ఖాళీలు భర్తీ చేయని పక్షంలో ఆర్టీఐ చట్టం-2005కు జీవం లేనట్టేనని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పర్డివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.