ఇకపై భారత్‌లోనే ఇంటెల్ లాప్‌టాప్‌ల తయారీ

ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ ఇకపై భారత్‌లోనే లాప్‌టాప్‌ల తయారీని  చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లోని ఎనిమిది స్థానిక కంపెనీలతో జత కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్), ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ల తయారీకి అవసరమైన టెక్నాలజీని ‘ఇంటెల్’ షేర్ చేసుకుంటుంది.
 
అంతే కాకుండా ల్యాప్‌టాప్‌ల తయారీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. తద్వారా ‘మేకిన్‌ ఇండియా’ ప్రాజెక్టుకు ఇంటెల్ మరింత ఊతమివ్వనుంది. ఇంటెల్ సంస్థతో జత కట్టిన దేశీయ కంపెనీల్లో భగవతీ ప్రొడక్ట్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్, పనాచే డిజిటల్ లైఫ్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, వీవీడీఎన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి.

వీటిలో పనాచే డిజిటల్ లైఫ్, కేన్స్ టెక్నాలజీ, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ తొలిసారి భారత్‌లో ల్యాప్‌టాప్‌ల తయారీలోకి ఎంటరవుతున్న సంస్థలు కావడం గమనార్హం. ఇంటెల్ తీసుకున్న నిర్ణయంపట్ల కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని సంస్థలు మేకిన్‌ ఇండియా దిశగా అడుగులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంటెల్ తాజా నిర్ణయం ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా ప్లాన్‌కు నెల వ్యవధిలో రెండవ ప్రధాన ప్రోత్సాహం కావడం విశేషం. అక్టోబర్‌లో గూగుల్ భారతదేశంలో తన తాజా ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 8 ఫోన్‌ల తయారీని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది.

ఈ క్రమంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో పాటు భారత్ ఎఫ్‌ఐహెచ్‌, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో గూగుల్ చర్చలు జరుపుతోందని సమాచారం. అలాగే, మరో దిగ్గజ సంస్థ యాపిల్‌ సైతం ఐఫోన్‌ 15 సిరీస్‌ విషయంలో మేక్‌ ఇన్‌ ఇండియా దిశగా అడుగులు వేసిన విషయం కూడా తెలిసిందే.