కాంగ్రెస్ తో పొత్తుకు సిపిఎం స్వస్తి .. ఒంటరిగానే పోటీ

కాంగ్రెస్ తో పొత్తుకు సిపిఎం స్వస్తి .. ఒంటరిగానే పోటీ
బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో వామపక్షాలు కూటమి ఏర్పాటు మూన్నాళ్ళ ముచ్చటగా మిగులుతుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మూడు రాస్త్రాలలో – మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ లలో సీట్ల సర్దుబాట్లకై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిగిన ఫలితం లేకపోవడంతో రెండు వామపక్షాలు విడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక తెలంగాణాలో సహితం అటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 
 
పొత్తుల విషయంలో కాంగ్రెస్ కు సీపీయం విధించిన డెడ్ లైన్ ముగియటంతో గురువారం జాబితాను విడుదల చేసింది. 17 స్థానాలతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేదు. ఇక జాబితాలో చూస్ పాలేరు, ఖమ్మం, వైరా, మిర్యాలగూడెం, ఇబ్రహీంపట్నంతో పాటు భద్రాచలం, మదిరా స్థానాలు ఉన్నాయి.

జాబితా విడుదల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర మాట్లాడుతూ బీజేపీని తెలంగాణాలో ఒక్క సీటు గెలవనియ్యమని చెప్పారు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో సీపీఎం నిలబడదని,  మునుగోడులో లాగా ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు కాంగ్రెస్‌ వైఖరిపై వీరభద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట్లో అడిగామని, అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని వివరించారు. ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారని తెలిపారు.  మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోందని చెప్పారు. పరిస్థితులు చూస్తుంటే తమతో పొత్తు వద్దని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుందని చెబుతూ పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, వామపక్షాలతో తమకు పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలకు నాలుగు సీట్లు ఇస్తే ఓడిపోతారని చెబుతూ  అలాంటి సమయంలో హంగ్ అసెంబ్లీ వస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.  అవసరమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వంలో రెండు లెఫ్ట్ పార్టీలకు చెరో ఎమ్మెల్సీని కేటాయిస్తామని చెప్పారు. అలాగే వారిని కేబినెట్లోకి తీసుకొని, రెండు మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు.