`ఇండియా’ కూటమిలో వామపక్షాలకు భంగపాటు

`ఇండియా’ కూటమిలో వామపక్షాలకు భంగపాటు
భారత రాజకీయ రాజకీయాలలో తమ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో మొదటిసారిగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిక్షాలు ఏర్పాటు చేసుకున్న `ఇండియా’ కూటమిలో చేరినా వామపక్షాలకు భంగపాటు తప్పడం లేదు. వామపక్షాలకు సీట్లు కేటాయింపు పట్ల కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆసక్తి చూపడం లేదు. దానితో కనీసం మూడు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
 
గతంలో జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యుపిఎ వంటి కూటమిలలో వామపక్షాలు క్రియాశీలకంగా వ్యవహరించినా అవి ఆయా కూటముల బయట నుండి మద్దతు ఇచ్చాయి గాని కూటమిలో భాగస్వామిగా చేరలేదు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం మంత్రివర్గంలో సిపిఐ  చేరిన కూడా కూటమిలో భాగస్వామిగా చేరలేదు.
 
కానీ, ఒక వంక పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాస్త్రాలలో పరస్పరం ఒకరిపై మరొకరు పోటీ చేసుకుంటూనే `ఇండియా’ కూటమిలో మొదటిసారిగా వామపక్షాలు భాగస్వామి కావడం ఆయన పార్టీల వర్గాల నుండి విమర్శలు ఎదురయ్యాయి. అయినా, నాలుగు సీట్లు గెలుచుకుంటే తమ రాజకీయ మనుగడ కాపాడుకోవచ్చని ఎదురు చూసిన వారికి ఆశాభంగం ఎదురవుతుంది.
 
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్- వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సుదీర్ఘంగా జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. ఇంకా తెలంగాణాలో ఒకటి, రెండు సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దానితో ఆ మూడు రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
 
రాజస్థాన్‌లో 17, ఛత్తీ్‌సగఢ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 4 స్థానాల్లో సీపీఎం పోటీచేయనుండగా. సీపీఐ ఛత్తీ్‌సగఢ్‌లో 16, రాజస్థాన్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 9 చోట్ల పోటీచేయడానికి సిద్ధమైంది. అయితే, సర్దుబాటు విఫలంపై కాంగ్రెస్‌, వామపక్ష నేతలు పెదవి విప్పడం లేదు.
 
 పొత్తు కుదిరి ఉంటే బాగుండేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ కేంద్ర కమిటీలో స్వతంత్రంగా పోటీ చేయాలని తీర్మానించాక ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఇండియా కూటమి ఏర్పాటైందన్న భావన ఎక్కువ మిత్రపక్షాల్లో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
అయితే రాష్ట్రాల్లో కూడా మైత్రి సాగాలని తాము వాంఛించామని.. దీనివల్ల లోక్‌సభ ఎన్నికల్లో మరింత సమన్వయం, సహకారాలకు ఆస్కారం ఉంటుందన్నది తమ అభిమతంగా పేర్కొన్నారు.  విపక్ష కూటమి పరిస్థితి ఏమీ బాగోలేదని, ఎన్నికలు జరిగే నాలుగైదు రాష్ట్రాల్లో అంతర్గత పోరు ఉందని జమ్మూకశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ మధ్య బహిరంగ పోరు కూటమికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
 
ఇలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణాలో తమకు సీట్లు ఇవ్వబోమని కాంగ్రెస్‌ ఎక్కడా చెప్పలేదని, ఈ విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఏఐసీసీ నేతలు తమతో మాట్లాడారని చెప్పారు. 
 
జాతీయ నేతల సమక్షంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాకు ఫోన్‌ చేశారని, తాము అడిగిన బెల్లంపల్లి స్థానానికి బదులుగా చెన్నూరు, మరో సీటు కొత్తగూడెం ఇస్తామన్నారని వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై సీపీఎంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.