అహ్మదాబాద్‌ నుంచి ఏక్తానగర్‌కు హెరిటేజ్‌ రైలు

అహ్మదాబాద్‌ నుంచి ఏక్తానగర్‌కు హెరిటేజ్‌ రైలు

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్మారక చిహ్నమైన ఐక్యతా విగ్రహం వద్దకు పర్యాటకులను తీసుకువచ్చే మొదటి హెరిటేజ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. మూడు బోగీలతో కూడిన హెరిటేజ్‌ రైలు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తో నడుస్తుంది. దీన్ని స్టీమ్‌ లోకోమోటివ్‌ నమూనాలో డిజైన్‌చేశారు. 

ఎగ్జాస్ట్‌ ఫ్యూమ్‌లను ఉత్పత్తి చేయడానికి ఫాగర్‌లతో నిండి ఉంటుంది. స్టీమ్‌ లోకోమోటివ్‌ మాదిరి హారన్‌ ఉండేలా ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేశారు.  ఈ రైలు వారసత్వం,ఆధునిక సౌకర్యాల సమ్మేళనం అని ప్రధాని పేర్కొన్నారు.  ఒక్కొక్క బోగీలో 48 సీట్లు ఉంటాయి. పర్యాటకులు టేకు డైనింగ్‌ టేబుల్‌లు, రెండు సీట్ల కుషన్‌ సోఫాలతో కూడిన 28-సీట్ల ఏసీ రెస్టారెంట్‌ డైనింగ్‌ కారులో టీ, స్నాక్స్‌ను ఆస్వాదించొచ్చు. ఈ రైలు నవంబర్‌ 5 నుంచి వారానికోసారి (ఆదివారం) నడుస్తుంది.

పర్యాటకుల నుంచి లభించే ఆదరణను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుతామని వడోదర డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ జితేంద్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇది ఉదయం 6:10 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి, ఏక్తానగర్‌కు ఉదయం 9:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, ఏక్తా నగర్‌ నుండి రాత్రి 8:23 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటి ఐదు నిమిషాలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.

వన్‌-వే ప్రయాణానికి ఛార్జీ రూ.885 ఉంటుంది. ఏక్తా నగర్‌ – అహ్మదాబాద్‌ మధ్య 182 కి.మీ ప్రయాణంలో ఈరైల్‌ నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తుంది. 1862లో అప్పటి బరోడా పాలకుడు ఖండేరావ్‌ గైక్వాడ్‌ ఈ రైలును పట్టాలెక్కించారు.  అప్పటి నుంచి వడోదర రైల్వేలో ఇది గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. అప్పట్లో దభోయ్‌- మియాగం మధ్య ఎనిమిది మైళ్ల ట్రాక్‌పై ఈ రైలును ఎద్దులు లాగేవి. 1880 నాటికి లోకోమోటివ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

రానున్న పాతికేళ్లలో సుసంపన్న దేశంగా భారత్

ఈ శతాబ్దం లో రానున్న 25 సంవత్సరాలు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ లోని కేవడియాలో వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించారు.

దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు ప్రతిభారతీయుడు పాతికేళ్లు స్వాతంత్ర్యం సాధించడానికి తనకు తాను అలసిపోయాడని, అదే విధంగా దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దడానికి రానున్న 25 ఏళ్లు ‘అమృత కాలాన్ని’ సాధించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. పటేల్ స్ఫూర్తితో ప్రతి లక్షాన్ని సాధించుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ కశ్మీర్, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్ ఎక్కడున్నా సంతోషిస్తారని చెప్పారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లో భారీస్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను వీక్షించారు.