హింసాత్మకం మరాఠా కోటా ఆందోళన… బీడ్‌ జిల్లా అంతటా కర్ఫ్యూ

హింసాత్మకం మరాఠా కోటా ఆందోళన…  బీడ్‌ జిల్లా అంతటా కర్ఫ్యూ
మహారాష్ట్రలోలో మరాఠా రిజర్వేషన్ లపై జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారుతుంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్‌ ఆందోళనకారులు సోమవారం ముట్టడించారు. బీడ్‌ జిల్లాలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు.  దీంతో బీడ్‌ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్‌ అధికారులు ప్రకటించారు.
కోటా అమలు కోసం ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టడాన్ని చిన్నపిల్లల ఆటగా ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకి అభివర్ణించడంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఇంటి వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటలు ఎగిసిపడుతుండగా ఆప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మరాఠా రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడు మనోజ్‌ జరంగే పాటిల్‌ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండగా  ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది. వైద్య పరీక్షలకు ఆయన నిరాకరిస్తున్నారు.  మరోవైపు కోటా విషయంలో సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలుకు సలహా ఇవ్వడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.
ఈ అంశంపై  ఇద్దరు శివసేన (షిండే వర్గం) ఎంపీలు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు.  మరాఠా కోటా అమలు జేయాలని డిమాండ్‌ చేస్తూ హింగోలి ఎంపీ హేమంత్‌ పాటిల్‌ తన రాజీనామా పత్రాన్ని న్యూఢిల్లీలో లోక్‌సభ సెక్రెటరీకి సమర్పించగా, నాసిక్‌ ఎంపీ హేమంత్‌ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు.
 
కాగా, ఈ సంఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నట్లు ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తు తనతో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది గాయపడలేదని చెప్పారు. తామంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టడం వల్ల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు.
 
బీడ్‌లోని మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్‌ క్షీరసాగర్‌ నివాసంపైనా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటికి, సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్‌ బాంబ్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.  బీడ్‌ జిల్లాలోని మజల్‌గావ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ భవనం మొదటి అంతస్తుకు కూడా నిప్పుపెట్టారు.
అలాగే ఆదివారం నుంచి సోమవారం నాటికి దాదాపు 13 ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. దీంతో 30 డిపోలలో సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. మరాఠా కోటా వివాదంపై ఆందోళనలు క్రికెట్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లపై కూడా ప్రభావం చూపాయి. సోమవారం పూణెలో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక తలపడుతున్నందున మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ఆందోళన కారులను వెనక్కిపంపారు.