రామజన్మభూమి ఉద్యమం “ఫీల్డ్ మార్షల్” మోరోపంత్ పింగ్లే

భవాని శంకర్                                                                                                                                                           * జన్మదిన నివాళి
అది అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కావచ్చు, మతమార్పిడులకు వ్యతిరేకంగా హిందువుల ఆగ్రహం కావచ్చు, గోసంరక్షణ ప్రయత్నాలు కావచ్చు… దేశంలో హిందువులలో జాగృతి కలిగిస్తూ, దేశ చరిత్రనే మలుపు తిప్పిన పలు ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేసి, ఆ దిశలో ప్రజలను సమీకరిస్తూ మొత్తం సంఘ్ పరివార సంస్థల పట్ల ప్రజల దృష్టిలో చెప్పుకోదగిన మార్పు తీసుకు వచ్చిన వారిలో జేష్ఠ  సంఘ్ ప్రచారక్ మోరోపంత్ పింగ్లేని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

హాస్య చతురతతో అందరిని ఆకట్టుకొనే విధంగా మాట్లాడుతూనే లోతైన ఆలోచనలను ప్రజలలో కలిగించడంలో అసాధారణమైన నైపుణ్యంకు ఆయన పేరొందారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ఏ బాధ్యతను అప్పచెప్పినా ఎవ్వరి ఊహలకు కూడా అందని విధంగా అత్యంత అద్భుతంగా, విశేష ప్రభావం సమాజంపై కలిగించే విధంగా పని చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనను రామజన్మభూమి ఉద్యమం నిర్మాతల్లో కీలకంగా భావిస్తారు. ఆయనను ఈ సందర్భంగా “ఫీల్డ్ మార్షల్” అని మీడియా పేర్కొన్నది.

మోరేశ్వర్ నీలకంఠ పింగ్లే అక్టోబర్ 30, 1919న జన్మించారు. బాల్యంలోనే తెలివైనవాడు గానే కాకుండా ఆటలలో మేటిగా, మాటలలో కొంటెవానిగా పేరొందారు.1930లో సంఘ్ పరిచయంలో వచ్చారు. 1941లో నాగ్‌పూర్‌లోని మోరిస్ కాలేజీలో బిఎ పూర్తి చేసి ప్రచారక్ గా వచ్చారు.  మొదట్లో మధ్య ప్రదేశ్ ఖాండ్వాలో సహ విభాగ్ ప్రచారక్ గా పనిచేశారు.  తరువాత, మధ్య భారత్ ప్రాంత ప్రచారక్ గా, మహారాష్ట్ర సహ ప్రాంత ప్రచారక్ గా, ఉత్తర భారత్ క్షేత్ర ప్రచారక్ గా, అఖిల్ భారత్ శారీరక ప్రముఖ్, బౌద్ధిక ప్రముఖ్, ప్రచార ప్రముఖ్ , సహ సర్ కార్యవాహ్ వంటి పలు కీలక బాధ్యతలు చేపట్టారు.

ఛత్రపతి శివాజీ 300వ వర్ధంతి సందర్భంగా రాయ్‌గఢ్‌లో విశేషమైన కార్యక్రమం జరిపారు. డాక్టర్ హెడ్గేవార్ సమాధి నిర్మాణం, ఆయన స్వగ్రామమైన కుందకుర్తి (తెలంగాణ)లో ఆయన కుటుంబ దేవత ఆలయాన్ని స్థాపించడం, బాబాసాహెబ్ ఆప్టే స్మారక కమిటీ ఆధ్వర్యంలో మరచిపోయిన చరిత్ర ఆవిష్కరణ, వేద గణితశాస్త్రం, సంస్కృతం మొదలైన వాటి ప్రచారం విషయం లో ఆయన విశేషమైన కృషి జరిపారు.

ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతవాసం గడుపుతూ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడంలో మోరోపంత్ కీలక పాత్ర పోషించారు. 1981లో మీనాక్షిపురం ఘటన తర్వాత, సంఘ్ చేసిన హిందూ జాగృతికి సంబంధించిన బహుళ స్థాయి ప్రణాళికలను రూపొందించి, అమలు పరచడంలో విశేషంగా కృషి చేశారు. దీని కింద ‘సంస్కృతి రక్షా నిధి’,  ‘ఏకతా రథయాత్రల’ నిర్వహణ వంటి భారీ సనసమీకరణ కార్యక్రమాలను  విజయవంతంగా నిర్వహించారు.

విశ్వ హిందూ పరిషత్ కు మార్గదర్శకుడిగా ఉంటూ శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని  హిందూ జాగృతి మంత్రంగా మార్చారు. శ్రీ రంజాన్ రథయాత్ర, ఆలయ తాళం తెరవడం, శ్రీరామ శిలాపూజ, శంకుస్థాపన, శ్రీరామజ్యోతి, పాదుకా పూజ తదితర కార్యక్రమాలు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. వీటి ఫలితంగానే డిసెంబరు 6, 1992న బాబ్రీ కళంకం తొలిగిపోయింది.

గోసంరక్షణ రంగంలో ఆయన ఆలోచనా విధానం కూడా పూర్తిగా విశిష్టమైనది. ఆవులను కేవలం రైతు ఇంట్లోనే రక్షించగలమని, గోశాలలో మాత్రమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆవు పాలతో పాటు ఆవు పేడ, మూత్రం కూడా ఉపయోగపడతాయి. రైతులు వాటి విలువను పొందడం ప్రారంభిస్తే, ఎవరూ తమ పశువులను అమ్మరు.

ఆయన స్ఫూర్తితో వందల రకాల సబ్బులు, నూనెలు, డిటర్జెంట్లు, పురుగుమందులు, ఫినైల్, షాంపూలు, టైల్స్, మస్కిటో కాయిల్స్, మందులు మొదలైన వాటిని ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేయడం ప్రారంభించారు. ఇవి మానవులకు, జంతువులకు, వ్యవసాయానికి బహుముఖ ప్రయోజనకారిగా రూపొందాయి. ఇప్పుడు ఆవు పేడ,  మూత్రంతో 24 గంటలపాటు నిరంతరం వెలిగే బల్బులను కూడా ఉపయోగిస్తున్నారు.

గతాన్ని, భవిష్యత్తును కలిపే వంతెన వర్తమానమని ఆయన విశ్వసించారు. కాబట్టి, దీనిపై అత్యంత శ్రద్ధ వహించాలి. స్థానిక, ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకుని, ప్రతిచోటా అనేక సంస్థలు, ప్రాజెక్టులను స్థాపించారు. మోరోపంత్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, వివేక్ వార పత్రిక, లఘు ఉద్యోగ్ భారతి, నానా పాల్కర్ స్మృతి సమితి, దేవ్‌బంద్ (థానే) సేవా ప్రకల్ప్, కల్వా లెప్రసీ నిర్మూలన ప్రాజెక్ట్, స్వాధ్యాయ మండల్ (కిలా పార్డి) పునఃస్థాపన మొదలైన వాటి స్థాపకులు.

మోరోపంత్ జీవితంలో నిరాశకు చోటు లేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ  కొత్త తరానికి దిశానిర్దేశం చేసిన మోరోపంత్ పింగిల్ సెప్టెంబర్ 21, 2003న నాగ్‌పూర్‌లో మరణించారు.