త్వరలో బ్యాంకులకూ ఐదు రోజుల పని విధానం!

ప్రభుత్వ, ప్రైవేట్, సహకార బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు త్వరలో తీపి కబురందే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల యాజమాన్యాల ఆధ్వర్యంలోని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. 
బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనం పెంపునకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సుముఖంగా ఉన్నట్లు వినికిడి.  కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం అంత కంటే ఎక్కువ వేతనాల పెంపు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా మహమ్మారి వేళ అవిశ్రాంతంగా సేవలందించి, ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో బ్యాంకులు కీలకంగా వ్యవహరించాయి.
దీనికి తోడు ఇటీవల బ్యాంకుల లాభాలు పెరిగినందున ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతిపాదనలు సమర్పించింది. ఐబీఏ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఎల్ఐసీలోనూ ఐదు రోజుల పని విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్ ను ముందుకు తెచ్చాయి. ఇప్పటికే బ్యాంకులకు రెండో, నాలుగో శనివారం సెలవు అమల్లో ఉంది. ఐబీఏ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే, బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి.