
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్లో ఈ నెల 21న 20వ పిల్లర్ కుంగుబాటు అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు అధికార పార్టీ మెడకు ఉచ్చు బిగిస్తోంది. మేడిగడ్డ బ్యారేజిలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పలు వివరాలను సేకరించింది. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేసింది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ పరిశీలనలో పాల్గొంది. బ్యారేజీకి చెందిన 20, 21 పిల్లర్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్ ఐదు అడుగుల మేర కుంగిపోయింది. వీటితో పాటు 15 నుండి 20వ నెం. వరకు ఉన్న పిల్లర్లను నిపుణుల బృందం పరిశీలించింది.
ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర కమిటీకి ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది. కమిటీ తిరుగుపయనానికి ముందే వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని, ఆదివారం వరకు అన్ని అంశాలపై సమగ్ర సమాచారం అందించాలని లేఖలో పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన ఇచ్చిన 20 ప్రశ్నల్లో మూడింటికి సమాధానం చెప్పడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆదివారం లోగా అన్ని ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆదివారం లోగా అన్ని ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం లేదని భావిస్తామని కేంద్రం హెచ్చరించింది. పంపే సమాధానాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని లేఖలో స్పష్టం చేసింది.
More Stories
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో కీలక నివేదిక
`దున్నపోతు’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలు
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ