
త్రిపుర గవర్నర్ గా తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం ఉదయం అగర్తలా లో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులు బుధవారం అగర్తలా చేరుకున్నారు. ఆ సమయంలో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎం పీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు.
అక్కడ కొత్త గవర్నర్ కు “గార్డు -ఆఫ్ -హానర్” నిర్వహించారు. ఈ సందర్భం గా తన నియామకంపై రాష్ట్రపతికి , ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ఇంద్రసేనా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయం నుండి గవర్నర్ దంపతులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. గురువారం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాజభవన్ లో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో ఇంద్రసేనా రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న వివిధ పధకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, వివరించారు.
ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ అధికారులు పారదర్శకత , జవాబుదారీతనం పాటించాలని, సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనేకమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్ కు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు పూల దండలతో ఇంద్రసేనా రెడ్డిని సత్కరించారు.
అనంతరం రాజభవన్ లో గవర్నర్ దంపతులు “హై టీ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సహచర మంత్రులు, అధికారులు , న్యాయమూర్తులు, మీడియా సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ గవర్నర్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు