వచ్చే రామనవమి అయోధ్యలోనే

వచ్చే రామనవమి అయోధ్యలోనే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని అభివర్ణించారు. అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూసే భాగ్యం మనకు కలగనుందని, వచ్చే రామనవమి అయోధ్యలోనే జరుగుతుందని చెప్పారు. 
 
ఢిల్లీలోని ద్వారక సెక్టర్-10లో రామ్‌లీలా మైదాన్‌లో మంగళవారంనాడు జరిగిన దసరా వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటూ
చంద్రయాన్ మిషన్ విజయవంతమైన రెండు నెలలైన ఈ ఏడాదిలోనే విజయదశమి వేడుకలు జరుపుకొంటున్నామని, విజయదశమికి సంప్రదాయబద్ధంగా ‘శస్త్ర పూజ’ కూడా చేస్తుంటామని చెప్పారు. 

భారతదేశ గడ్డపై ఆయుధాలను పూజించడం సంప్రదాయమని, భూములను ఆక్రమించుకునేందుకు ఆయుధ పూజ చేయమని, సొంతగడ్డను రక్షించుకునేందుకు చేస్తామని చెప్పారు. “మన శక్తి పూజ కేవలం మన కోసం కాదు. యావత్ ప్రపంచ సంక్షేమం కోసం” అని పేర్కొన్నారు. విజయదశమి పండుగ జాతికి చెందిన ప్రతి దుర్మార్గంపై దేశభక్తి విజయోత్సవ పండుగగా కూడా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. 

ఇవాళ మనం చాలా అదృష్టవంతులమని, అయోధ్యలో భవ్య రామాలయాన్ని చూడబోతున్నామని మోదీ తెలిపారు. వచ్చే రామనవమి అయోధ్యలో జరుగుతుందన్నారు. భవ్య రామాలయంలో రామచంద్రుని దర్శనానికి ఇక కొద్ది నెలలే మిగిలాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మోదీ సంప్రదాయబద్ధంగా ‘ఆయుధ పూజ’ నిర్వహించారు. 

ఈ వేడుకల్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ వేషధారణలో ప్రదర్శనకు సిద్ధమైన కళాకారులకు మోదీ స్వయంగా తిలకం దిద్ది, హారతి పట్టారు. ‘రావణ్ దహన్’లోనూ పాల్గొన్నారు. రావణ దహనం అంటే కేవలం గడ్డిబొమ్మను దహనం చేయడం మాత్రమే కాదని, భరతమాతను కులం, ప్రాంతీయవాదం పేరుతో విడగొట్టాలని చూసే శక్తుల అంశం కూడా అని చెప్పారు.

అభివృద్ధి పథంలో కొత్త శక్తి, కొత్త తీర్మానాలతో ముందుకు వెళ్తామని తెలిపారు.. అందరం కలిసి ‘శ్రేష్ఠ భారత్‌’ని రూపొందించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, కులతత్వం, ప్రాంతీయతత్వం సమాజంలోని సామరస్యానికి హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.

కనీసం ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడం సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను ప్రధాని కోరారు.

10 ప్రతినలు ఇవే 

1.భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయడం,

 2.డిజిటల్ చెల్లింపు వ్యవస్థల వినియోగానికి ప్రజలను సంసిద్ధులను చేయడం,

3.గ్రామాల పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగి ఉండటం,

 4.స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం 

5. పనిలో నైపుణ్యం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ 

6. ముందు స్వదేశంలో పర్యటించడం, ఆ తర్వాతే ప్రపంచం చుట్టడం.

7.ప్రకృతి వ్యవసాయంపై రైతులను జాగృతం చేయడం

8.రోజువారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చడం.

9. ప్రతి ఒక్కరు దేహదారుఢ్యంపై దృష్టి సారించడం.

10. ఒక్కొక్కరూ కనీసం ఒక్కో పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం.