ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసిడి) దేశాలకు వలసవెళ్లేవారిలో అగ్రస్థానంలో ఉన్న భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందడంలో కూడా ముందున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాలోనే ఉండటం గమనార్హం. విదేశీ పౌరులకు పౌరసత్వం మంజూరు చేయడంలో కెనడా అత్యధిక వృద్ధిని కనబరచడం చెప్పుకోదగ్గ విశేషం.
పారిస్ -ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్‌లుక్‌లో విడుదల చేసిన ఓఈసిడి నివేదిక ప్రకారం 2023లో ధనిక దేశాల పౌరసత్వాన్ని పొందిన విదేశీయుల్లో భారతీయులు ముందువరుసలో ఉన్నారు. విదేశీయులకు పౌరసత్వం మంజూరు విషయంలో 2021-2022 మధ్య కెనడా 174 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గత ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో విదేశీ పౌరులు ఓఈసిడి దేశ పౌరసత్వాన్ని పొందారు. 2021 కంటే 25 శాతం ఎక్కువ మంది విదేశీయులకు ఈ దేశాల్లో పౌరసత్వం లభించింది. 2022కి సంబంధించిన పూర్తి డేటాను మాత్రం నివేదిక వెల్లడించలేదు. కానీ 2019 నుంచి ఓఈసిడి దేశ పౌరసత్వాలను పొందినవారి విషయానికి వస్తే భారతీయులే అత్యధికం.
2021లో దాదాపు 1.3 లక్షల మంది భారతీయులు ఓఈసిడి సభ్య దేశాల పౌరసత్వాన్ని పొందితే, 2019లో ఈ సంఖ్య దాదాపు 1.5 లక్షలుగా ఉంది. ఈ జాబితాలో చైనీయులు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ ఏడాది దాదాపు 57,000 మంది చైనీయులు ఈ దేశాల్లో పౌరసత్వం పొందారు. 2021లో భారతీయ వలసదారులకు పాస్‌పోర్ట్‌లను అందజేసిన ఓఈసిడిలోని 38 సభ్య దేశాల్లో అమెరికా (56,000), ఆస్ట్రేలియా (24,000), కెనడా (21,000) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
కాగా, ఇటీవల భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపన్నులు కుటుంబ సమేతంగా విదేశాలకు తరలిపోతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు.
గడచిన దశాబ్ద కాలంలో భారతదేశ పౌరసత్వాన్ని 16,21,561 మంది వదులుకున్నట్టు సాక్షాత్తు కేంద్రమే పార్లమెంట్‌లో ప్రకటించింది.పొరుగు దేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతూ అక్కడ పౌరసత్వం కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో లక్షలాది దరఖాస్తులు ఆయా దేశాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే శాశ్వత నివాసం కోసం 4,16,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 78 వేల మంది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో భారతీయులు పౌరసత్వం తీసుకున్నారు.

More Stories
ప్రపంచ ఉగ్రవాదనికి కేంద్ర బిందువు పాక్
చనిపోతానని తెలిసినా తూటాలకు ఎదురెళ్లిన సిడ్నీ హీరో!
సిడ్నీ ఉగ్రదాడిలో పాక్ సంతతి తండ్రి, కొడుకులు