మ‌రో ఇద్ద‌రు బందీల‌ను విడుద‌ల చేసిన హ‌మాస్

మ‌రో ఇద్ద‌రు బందీల‌ను విడుద‌ల చేసిన హ‌మాస్
గాజాలోని హ‌మాస్ చెర‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇత‌ర దేశాల పౌరులను క్ర‌మ‌క్ర‌మంగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా మ‌రో ఇద్ద‌రు బందీల‌ను హ‌మాస్ విడుద‌ల చేసింది. మాన‌వ‌తా దృక్ప‌థంతో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు హమాస్ ప్ర‌క‌టించింది. ఖ‌తార్, ఈజిప్టు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతోనే మ‌హిళ‌ల‌ను విడిచిపెట్టామ‌ని హమాస్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 
 
హమాస్ విడుదల చేసిన ఇద్దరు మహిళలు రఫా సరిహద్దు నుంచి చేరుకున్నట్టు ఇజ్రాయేల్‌ సైన్యం తెలిపింది. విడుద‌లైన ఇద్ద‌రు మ‌హిళ‌లు అమెరికాకు చెందిన జుడిత్ టై రాన‌న్, ఆమె కూతురు న‌ట‌లై సోష‌నా రాన‌న్. రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన జుడిత్ తాయ్ రాన్, ఆమె కుమార్తె నటాలే షోషన్ రాన్‌లను హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉండగా, పలు మీడియా నివేదికల ప్రకారం మరో 50 మంది బందీలను హమాస్ విడుదల చేయనుంది. మరోవైపు, గాజాకు వెళ్తోన్న రెడ్‌ క్రాస్ ప్రతినిధులను కూడా బందీలుగా చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక, హమాస్ చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్టు సోమవారం ఇజ్రాయేల్ ధ్రువీకరించింది. 
 
హమాస్‌ను అంతం చేయడానికి నిరంతర దాడులకు సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. ప్రాణనష్టాన్ని విస్మరించే ఏదైనా ఇజ్రాయెల్ సైనిక వ్యూహం చివరికి ఎదురుదెబ్బ తగలవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించినప్పటికీ ఆ దేశం వెనక్కి తగ్గడం లేదు.
భూతల యుద్ధానికి ఇక ఊపేక్షించబోమని ఇజ్రాయేల్ విద్యుత్ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ జర్మన్ పత్రికతో పేర్కొన్నారు. బందీలను క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రతిదీ చేస్తామని చెప్పారు. అటు, ఇజ్రాయేల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి 24 గంటల్లో ఏకంగా 300 కొత్త ప్రాంతాల్లో దాడులు చేసింది. 
 
ఇప్పటి వరకూ ఇజ్రాయేల్ దాడుల్లో 2 వేల మంది చిన్నారులు సహా 5 వేల మంది చనిపోయినట్టు తెలుస్తోంది. గాజా కాల్పుల విరమణ హమాస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని అమెరికా హెచ్చరించడంతో ఇజ్రాయేల్-హమాస్ యుద్ధం మానవతా విరమణకు సంబంధించి పిలుపును యూరోపియన్ యూనియన్ పరిశీలిస్తోంది.


కాల్పుల విరమణ హమాస్‌కు విశ్రాంతిని, పునరుద్ధరణ, ఇజ్రాయేల్‌పై తీవ్రవాద దాడులను కొనసాగించడానికి సిద్ధమయ్యే సామర్థ్యాన్ని ఇస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులతో తెలిపారు. మరోవంక, చెరలో ఉన్న బందీలందరినీ హమాస్ విడుదల చేస్తే గాజాపై దాడుల విరమణ గురించి చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.