ఇజ్రాయిల్- హమాస్ వంటి యుద్ధం భారత్ లో జరగదు

 
* ఇక్కడ హిందువులు ఉండడంతో ముస్లింలు భద్రం
 
ప్రస్తుతం ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు భారత్‌ లో ఎప్పుడూ చూడలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్  డా. మోహన్‌ భగవత్‌ తెలిపారు. ఇది హిందువుల దేశం కాబట్టి భారతదేశంలో ఇటువంటి ఘర్షణలు ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పారు.
ఇక్కడ ముస్లింలు కూడా అత్యంత సురక్షితంగా ఉన్నారని పేర్కొంటూ హిందువులు మాత్రమే అటువంటి భద్రత కల్పించగలరని స్పష్టం చేశారు.
హిందూ మతం అన్ని వర్గాలు, విశ్వాసాలను గౌరవిస్తుందని చెబుతూ ముస్లింలతో సహా అందరూ భారతదేశంలో సురక్షితంగా,భద్రంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు.  ఈ దేశంలో అన్ని వర్గాలను, విశ్వాసాలను గౌరవించే మతం, సంస్కృతి ఉందని పేర్కొన్నారు.
ఇది హిందువుల దేశం. అంటే మనం మిగతా (మతాలను) తిరస్కరించడం కాదు. ఒక్కసారి హిందువులంటే ముస్లింలు కూడా రక్షించబడతారని చెప్పనవసరం లేదు. హిందువులు మాత్రమే ఇలా చేస్తారు. భారతదేశం మాత్రమే ఈ విధంగా చేస్తుంది. ఇతరులు ఆ విధంగా చేయలేరు”అని డా. భగవత్ తెలిపారు. 
 
“మిగిలిన ప్రతిచోటా, ఘర్షణలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధం, హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం గురించి మీరు తప్పక విన్నారు. మన దేశంలో ఇలాంటి సమస్యలపై ఎప్పుడూ యుద్ధాలు జరగలేదు. శివాజీ మహారాజ్ కాలంలో జరిగిన దండయాత్ర అలాంటిదే. కానీ మనం  ఇటువంటి సమస్యపై ఎవరితోనూ పోరాడలేదు. అందుకే మనం హిందువులం” అని చెప్పారు.
 
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు  శివాజీని హిందూమతపు సమగ్ర భావనకు ప్రతిబింబం అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.
 
శివాజీ పోరాటం విదేశీ ఆక్రమణదారులపైనేనని, భారతీయులపై కాదని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం, ఆయన శివాజీ, కుతుబ్ షాహీల మధ్య ఏర్పడిన వ్యూహాత్మక మైత్రిని ప్రస్తావించారు. శివాజీ జీవితం గురించిన వృత్తాంతాలను ప్రస్తావిస్తూ అతను హిందువుగా ఉన్నందుకు గర్వించాడు కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.