దీపావళికి 24 లక్షల దీపాల వెలుగులు

దీపావళికి 24 లక్షల దీపాల వెలుగులు
అయోధ్యలో ఘనంగా దీపావళి పండగ ఏర్పాట్లను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీపావళి పండగ అంటేనే దీపాల అలంకరణ. ఈ నేపథ్యంలోనే అయోధ్య నగరం దీపోత్సవానికి ముస్తాబు అవుతోంది. 
నవంబర్ 11 వ తేదీన అయోధ్యలో దీపోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 24 లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైరిపై 24 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ దీపోత్సవంలో అయోధ్యలో నవంబర్ 11 నుంచి రామ్ కీ పైరీలో ప్రతీ రోజూ గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించనున్నారు.
ప్రతీ రోజూ 2 సార్లు ఈ గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షోలు వేయనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలకు రూ. 20 కోట్ల వ్యయంతో నిర్వహించనున్నారు.  ఆ తర్వాత సరయూ నదికి హారతి ఇచ్చి.. అనంతరం ఈ షోను మొదలు పెట్టనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణం ఆధారిత సినిమాలను ప్రదర్శిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం నుంచి ప్రతీ ఏడాది దీపావళి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే అయోధ్యలో దీపోత్సవాలను నిర్వహిస్తున్నారు. 2017 లో 51 వేల దీపాలను వెలిగించిన ప్రభుత్వం, 2019 లో 4.10 లక్షలు, 2020 లో 6 లక్షలు, 2021 లో 9 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఇక 2022 లో సరయూ నదీ తీరంలో ఉన్న రామ్ కీ పైరీలోని ఘాట్‌లలో 17 లక్షలకు పైగా దీపాలను దీపావళి సందర్భంగా వెలిగించారు.
 
మరోవంక, అయోధ్య రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. రాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇక రాముడి విగ్రహం అక్టోబర్ 30 నాటికి పూర్తవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తాజాగా తెలిపారు.  అక్టోబర్ 30 నాటికి రాముడి విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చూసేందుకు సిద్ధం చేస్తామని విపిన్ భదౌరియా పేర్కొన్నారు. అయోధ్య రాముడిని బాలుడి రూపంలో చెక్కినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా 3 రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ 3 రాముడి విగ్రహాలను వేర్వేరు శిల్పులు చెక్కుతున్నారని పేర్కొన్నారు. ఈ 3 విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి.. అయోధ్య రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారని వెల్లడించారు. అయోధ్య రామాలయంలో ఉంచే రాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని విపిన్ భదౌరియా స్పష్టం చేశారు.