గర్భవిచ్ఛిత్తికి అనుమతి నిరాకరించిన సుప్రీంకోర్టు

గత కొద్ది రోజులుగా మలుపుతూ తిరుగుతున్న గర్భవిచ్చిత్తి కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తన 26 వారాల గర్భాన్ని తొలగించుకొనేందుకు పిటిషన్‌దారురాలైన ఓ 27 ఏండ్ల వివాహితకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.  గర్భంలోని పిండం ఆరోగ్యవంతంగా ఉన్నదని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

గర్భం వయసు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) గరిష్ఠ పరిమితి అయిన 24 వారాలు దాటిందని, ఆ తర్వాత గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. పిండం వయసు 26 వారాల 5 రోజులుగా ఉన్నదని, పిండంలో అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, తల్లి ఆరోగ్యానికి తక్షణ ముప్పు లేదని పేర్కొన్నది.

గుండెచప్పుడు ఆపలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని.. ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చిన్నారి పుట్టిన తర్వాత స్వయంగా పెంచుకోవడమా లేదా దత్తత ఇచ్చే అంశంపై తల్లిదండ్రులు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు.

తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, రెండో ప్రసవం అనంతరం తాను సైకోసిస్‌ సమస్యతో బాధపడుతున్నానని, మూడో గర్భాన్ని తొలగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ మహిళ పిటిషన్‌ వేశారు. ఎయిమ్స్‌ వైద్యుల నివేదిక మేరకు మొదట న్యాయస్థానం గర్భవిచ్చిత్తికి ఈనెల 9న అనుమతి ఇచ్చింది. 

అయితే అనంతరం పిండం బతికేందుకు అవకాశం ఉందని పేర్కొంటూ సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎయిమ్స్‌ బృందంలోని వైద్యుడొకరు ఈనెల 10న కోర్టుకు ఈమెయిల్‌ పంపారు. ఈ నేపథ్యంలో తీర్పును పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. గత బుధవారం జరిగిన విచారణలో భిన్న తీర్పులు వచ్చాయి. ఆ తర్వాత ఈ కేసు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.