ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ప్రమాదమే

ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ప్రమాదమే
 
ప్రపంచంలో ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలకు మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ఉత్తర భారత్‌తో సహా తూర్పు పాకిస్థాన్‌ లోని కోట్లాది మంది ప్రజలు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని,  దాదాపు 220 కోట్ల మంది ప్రజల మీద ప్రభావాన్ని చూపుతుందని ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
భూ గ్రహం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడెక్కుతున్నట్లు సూచించింది. ఈ తీవ్రమైన వేడి కారణంగా వడదెబ్బ గుండెపోటు ముప్పు పొంచి ఉంటుందని, అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. 
 
ఈ వేడి వాతావరణం కారణంగా మనుషులు తమ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబర్చుకునే వీలు ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల్లో ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగినా కోట్లాది మంది తీవ్రమైన వేడి, గాల్లో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదంతా కూడా పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వివరించింది.
 
 ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు సూచించారు. మార్పులు చేయకపోతే మధ్య తరగతి, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయని వెల్లడించారు.