భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై ఆమె కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. 
 
వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు.

కుంజా సత్యవతి హఠాన్మరణం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. 2009-14లో అసెంబ్లీలో వారితో కలిసి పనిచేసినట్లు చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఆమె ఎప్పుడూ తపనపడే వారని గుర్తు చేసుకున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజా సంక్షేమం విషయంలో తన వాణిని బలంగా వినిపించేవారని కొనియాడారు.

ములుగులో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీని మోదీ గారు ప్రకటించిన సందర్భంగా.. వారం రోజుల క్రితం మేడారంలో అమ్మవారిని దర్శించుకుని,మోదీకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా సత్యవతితో మాట్లాడానని చెప్పారు. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును వివరించారని, ఇంతలోనే.. ఇలాంటి దిగ్బ్రాంతికరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.