ప్రవల్లిక ఆత్మహత్యపై నివేదిక కోరిన గవర్నర్

ప్రవల్లిక ఆత్మహత్యపై నివేదిక కోరిన గవర్నర్
 
హైదరాబాద్ అశోక్ నగర్ లో వరంగల్ కు చెందిన విద్యార్థిని మర్రి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గ్రూప్- 2 ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న ఆమె గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. పోటీ పరీక్షల నిర్వహణలో రాష్త్ర ప్రభుత్వ వైఫల్యాలు ఏవిధంగా యువతను నైరాశ్యానికి గురిచేస్తున్నాయో ఈ ఘటన వెల్లడి చేస్తుంది. 
 
 శుక్రవారం ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థులు భారీగా మోహరించి ఆందోళన చేపట్టారు. ప్రవల్లిక మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుని ఈ చావుకు బాధ్యులెవరు? అంటూ ప్రశ్నించారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
భారీ బందోబస్తు మధ్య ప్రవల్లిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని నేడు ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని బిక్కాజి పల్లికి తరలించారు. ప్రవల్లిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రవల్లిక అంత్య క్రియల్లో భారీగా విద్యార్థులు పాల్గొంటున్నారు. 
 
కాగా, ఇక గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టిఎస్పీఎస్సీ కార్యదర్శి లను రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్ ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. 
 
 ప్రవల్లిక మరణం యువతరం, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎత్తి చూపుతోందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ -2 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన క్రమంలో చోటు చేసుకున్న యువ ఉద్యోగార్ది ప్రవల్లిక ఆత్మహత్యపై ఇప్పుడు గవర్నర్ దృష్టి సారించారు.
 
అయితే, ప్రవళిక ప్రియుడు తనను కాదని మరో యువతితో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దిగులు చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి తెలిపారు.  ప్రవళికది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యే అని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రజా సంఘాలు ఆరోపిస్తోండగా అధికార బీఆర్ఎస్ మాత్రం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని చెబుతున్నది.