పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ కాల్చివేత!

పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ కాల్చివేత!

భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఉదయం హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో గుర్తుతెలియని సాయుధులు అతడిని కాల్చిచంపారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యుడైన 41ఏళ్ల షాహిద్‌పై భారత్‌లో పలు కేసులున్నాయి. లతీఫ్ ఒక మసీదులో ఉండగా, అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. 

మొదట, 1993 లో లతీఫ్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత నవంబరు 12, 1994లో ఉపాచట్టం కింద అరెస్ట్ అయ్యాడు. జమ్మూ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అదే జైలులో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తో పరిచయమైంది.  అరెస్ట్ అయిన అతడు 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు.. వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్థాన్‌కు పరారయ్యాడు.

అనంతరం జైషే మహమ్మద్‌లో చేరిన అతడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.  1999లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌లో అతడు నిందితుడిగా ఉన్నాడు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అతడిని మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుగా ప్రకటించింది. జనవరి 2, 2016లో పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు.  సియోల్‌కోట్ నుంచే ఈ దాడిని పర్యవేక్షించిన షాహిద్ ఇందుకోసం నలుగురు ఉగ్రవాదులను పంపాడు.

జనవరి 2, 2016 న పఠాన్ కోట్ లోని భారతీయ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నలుగురు ఉగ్రవాదులు స్థావరంలోకి చొరబడి ఐఏఎఫ్ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఐఏఎఫ్ ఎయిర్ బేస్ లోని సాయుధ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ దాదాపు 3 రోజుల పాటు కొనసాగింది. ఎట్టకేలకు నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కానీ, ఉగ్రవాదుల చేతిలో మొత్తం ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

భారత్ లో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదులు, నేరస్తులు విదేశాల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జాబితాలో ఇప్పుడు తాజాగా లతీఫ్ చేరాడు. ఖలిస్తాన్ మద్దతుదారు, భారత్ లో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో ఒక గురుద్వారా ముందు ఈ జూన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ పరంజిత్ సింగ్ పాంజ్వర్ ను లాహోర్ లో ఈ మే నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.