ఆసియా క్రీడల్లో చరిత్రను సృష్టించారంటూ ప్రధాని ప్రశంసలు

ఆసియా క్రీడల్లో చరిత్రను సృష్టించారంటూ ప్రధాని ప్రశంసలు
దేశానికి రికార్డు స్థాయిలో పతకాల పంట పడించిన ఆసియన్ గేమ్స్ కంటింజెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. చరిత్రను సృష్టించారంటూ ప్రశంసలు కురిపించారు. మహిళా అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని శ్లాఘించారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆసియా క్రీడలలో పాల్గొన్న భారతబృందాన్ని  మోదీ స్వయంగా కలుసుకుని అభినందించారు.

”ఆసియా క్రీడల్లో మన నారీ శక్తి చూపించిన ప్రతిభను చూసి ఎంతో గర్విస్తున్నాను. మీరు సాధించిన విజయాలు ఈదేశంలోని ఆడబిడ్డలను ప్రతిభను చాటుతోంది. ఇండియన్ టీమ్ చూపించిన ప్రతిభాపాటవాలతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది” అని మోదీ కొనియాడారు. 

క్రీడాకారుల బృందం చరిత్ర సృష్టించిందని, అథ్లెట్లందరికీ 140 కోట్ల భారతీయుల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. క్రీడాకారుల కఠోర శ్రమ, సాధించిన విజయాలతో దేశంలో పండుగ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. మన దేశంలో ప్రతిభకు కొరత లేదని, కానీ కొన్ని ప్రతికూలతల కారణంగా క్రీడాకారుల ప్రతిభను మెడల్స్‌గా మార్చుకోలేకపోయామని పేర్కొ న్నారు. 

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 100కు పైగా పతకాలు సాధించుకు వచ్చారు.  28 స్వర్ణ, 38 రజిత, 41 కాంస్య పతకాలు సాధించారు. స్క్వాష్‌లో రెండు స్వర్ణ పతాకలతో సహా ఐదు పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో మెన్స్ డబుల్స్‌తో స్వర్ణ పతకంతో సహా మూడు  పతకాలు సాధించారు.